ఆఫ్గనిస్తాన్‌లో మహిళలపై అణచివేత మొదలైంది... ఓ మహిళా జర్నలిస్టుకు చేదు అనుభవం...
ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో అక్కడి ప్రజల హక్కులు,భవిష్యత్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆఫ్గన్ ఆక్రమణ పూర్తయ్యాక నిర్వహించిన మొదటి ప్రెస్‌మీట్‌లో తాలిబన్ల మాటలు కాస్త ఉదారంగా కనిపించినప్పటికీ... వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. అనుకున్నట్లు గానే స్త్రీల పట్ల వారు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా షబ్నమ్ అనే మహిళా జర్నలిస్ట్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో వీడియో రూపంలో పోస్ట్ చేశారు.
ఆఫ్గన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్టీఏ టీవీ ఛానెల్‌లో షబ్నమ్ పనిచేస్తున్నారు. ఇటీవల ఎప్పటిలాగే తాను పనిచేసే టీవీ కార్యాలయానికి వెళ్లగా... అక్కడి సిబ్బంది తనను అనుమతించలేదని షబ్నమ్ తెలిపారు. కేవలం పురుష జర్నలిస్టులను మాత్రమే అనుమతిస్తున్నట్లు వారు చెప్పారని పేర్కొన్నారు. తాలిబన్లు ఆఫ్గన్‌ను ఆక్రమించుకోవడంతో వ్యవస్థ మారిపోయిందని... ఇకపై మహిళా జర్నలిస్టులను అనుమతించట్లేదని చెప్పినట్లు తెలిపారు.

'నా మాటలు వింటున్నవారు... ఒకవేళ ప్రపంచం నా మాటలు వింటుంటే... దయచేసి మాకు సహాయం చేయండి... మేము ఆపదలో ఉన్నాం,మా ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది.' అని షబ్నమ్ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
షరియా చట్టాలకు లోబడి స్త్రీల హక్కులు ఉంటాయని తాలిబన్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్యతో పాటు ఎడ్యుకేషన్,హెల్త్,తదితర రంగాల్లో స్త్రీలు ఉద్యోగాలు చేసేందుకు అనుమతి ఉంటుందన్నారు. కానీ తాజా పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగానే ఉన్నాయి.దీంతో ఆఫ్గనిస్తాన్‌లోని స్త్రీల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.
Recommended Video
ఈ ఏడాది జులైలో కాందహార్‌లోని ఓ బ్యాంకులోకి చొరబడ్డ తాలిబన్లు... అక్కడ పనిచేస్తున్న తొమ్మిది మంది మహిళా ఉద్యోగులను ఇంటికి పంపించేశారు. మళ్లీ ఉద్యోగాలకు రావొద్దని... వారి స్థానంలో కుటుంబ సభ్యుల్లోని మగవారిని పంపించాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే గతంలో తాలిబన్లు సాగించిన అరాచకాలు మరోసారి రిపీట్ అయే ప్రమాదం కనిపిస్తోంది. 1996-2001 వరకు తాలిబన్లు ఆఫ్గన్‌ను ఏలిన కాలంలో స్త్రీలను దారుణంగా అణచివేశారు. వారికి విద్య,ఉద్యోగాలపై నిషేధం విధించారు. మగ తోడు లేకుండా బయటకు రావొద్దని ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత తాలిబన్ల పాలనలో స్త్రీల హక్కులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications