బాబీజిందాల్ చిత్రపటంపై యూఎస్‌లో వివాదం, తెలియనందునే..
వాషింగ్టన్: లరూసియానా గవర్నర్‌గా ఉన్న భారతీయ అమెరికన్ బాబీ జిందాల్ చిత్రపటం అమెరికాలో వివాదానికి దారి తీసింది. ఆయన మేనిఛాయను ఉన్నది ఉన్నట్లుగా కాకుండా తెల్లజాతీయునిగా చూపడమే ఈ వివాదానికి కారణమైంది. 2008 నుండి ఈ ఫోటో ఉంది.
అయితే, ఇటీవల దీనిని సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శిస్తున్నారు. వాటిపై వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో వివాదం ప్రారంభమైంది. గవర్నర్‌ను తాను ఎప్పుడు కలువలేదని, ఆయన మేనిఛాయ గురించి తనకు అంతగా తెలియదని, అందుకే అలా వేసినట్లు ఆ ఫోటోను గీసిన టామీ యో జూనియర్ చెప్పారు.
కాగా, కొద్ది రోజుల క్రితం లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన తల్లిదండ్రులు నాలుగు దశాబ్దాల క్రితం భారత్ నుండి అమెరికాకు వచ్చారని, అమెరికన్స్‌గా ఉండేందుకు వచ్చామని, ఇండియన్ అమెరికన్స్‌గా ఉండేందుకు కాదని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాబీ జిందాల్ వలసవాది అని, వంశమూలాలు అమెరికా భూభూగంలోనివి కాదని ఆయన పైన విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యల పైన ఆయన స్పందించారు. తన తల్లిదండ్రులు అమెరికన్ కలలు నెరవేర్చుకునేందుకు వచ్చారని, విజయం సాధించారన్నారు. వారికి సంబంధించి ఇది కేవలం ఒక ప్రాంతం కాదని, ఒక ఆలోచన అన్నారు. మనం అమెరికన్లుగా ఉండేందుకు ఇక్కడకు వచ్చామని, ఇండియన్ - అమెరికన్లుగా ఉండేందుకు రాలేదని తన తల్లిదండ్రులు చెప్పారన్నారు.
భారతీయులుగా ఉండాలని భావిస్తే తాము అక్కడే ఉండేవారమన్నారు. అంతమాత్రాన భారత్ అంటే అయిష్టం కాదని చెప్పారు. మరిన్ని అవకాశాల కోసం, మరింత స్వాతంత్ర్యం కోసం తమ తల్లిదండ్రులు ఇక్కడకు వచ్చారన్నారు. అమెరికాలో ప్రవాసులు అనే దానిని తాను విశ్వసించనని చెప్పారు. ఇండియన్ అమెరికన్, ఐరిష్ అమెరికన్, ఆఫ్రికన్ అమెరికన్, ఇటాలియన్ అమెరికన్, మెక్సికన్ అమెరికన్.. ఇవన్నీ సరికాదని అభిప్రాయపడ్డారు.
అమెరికా లేదా ఏ ఇతర దేశమైన బలమైన ఆర్థిక వ్యవస్థను రక్షించడమే మొదటి స్టెప్ అన్నారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో బాబీ జిందాల్ కూడా ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.












Click it and Unblock the Notifications