చేతల మనిషిని, ప్రజలను విభజించను: బాబీ జిందాల్
న్యూయార్క్: వివిధ దేశాల నుంచి వచ్చి ఎన్నో ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్న వారంతా అమెరికన్లేనని, జాతిమతాల పేరుతో వారిని వేరుగా పరిగణించడం తగదని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న భారతీయ అమెరికన్ బాబీ జిందాల్ అన్నారు. న్యూఓర్లిన్స్ నుంచి గురువారం ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
‘నా పేరు బాబీ జిందాల్. నేను లూసియానా రాష్ట్ర గవర్నర్‌ను. అమెరికా సంయుక్త రాష్ర్టాల అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా.. గెలిపించండి' అని ప్రజలను కోరారు. భిన్న వర్గాలకు చెందిన ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై జిందాల్ ఆరోపణలు గుప్పించారు.
జాతి, మతం, ప్రాంతాలను బట్టి మనుషులను విభజించేందుకు ఒబామా యత్నిస్తున్నారని అన్నారు. ‘భారత సంతతికి చెందిన అమెరికన్' అని లేదా మరో కారణం చేత అమెరికన్ల నుంచి ‘తనను విడదీయకండి' అంటూ జిందాల్ చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది.

తాను చేతల మనిషినని, కేవలం మాటల మనిషిని కాదన్నారు. మాటలు దేశాన్ని ముందుకు నడిపించలేవని రుజువైందని, ఒకవేళ అదే నిజమైతే ఇప్పటికే దేశం పరిస్థితి మెరుగ్గా ఉండేదన్నారు. అమెరికా రక్షణ వ్యవస్థను బలోపేతం చేసి.. ప్రపంచంలో మరింత గొప్ప దేశంగా మారుస్తానని తెలిపారు. ఉగ్రవాదాన్ని మట్టుబెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఒబామా, హిల్లరీ క్లింటన్‌లవి తప్పుడు వ్యూహాలన్నారు.
అధ్యక్షుడు ఒబామా ఆరోగ్య పథకాన్ని రద్దు చేస్తానని, అమెరికాకు ఇస్లామిక్ ఉగ్రవాద చీడను వదిలిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వాన్ని తగ్గించి.. ప్రైవేట్ రంగ పెట్టుబడిని వృద్ధి చేస్తానని ప్రకటించారు. తనను తాను అజాతశత్రువుగా అభివర్ణించుకొన్నారు.
కాగా, విపక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నవారిలో బాబీ జిందాల్ 13వ అభ్యర్థిగా నిలిచారు. భారత సంతతికి చెందిన అమెరికన్ పౌరుడు అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవడం అమెరికా రాజకీయ చరిత్రలోనే ఇది తొలిసారి.












Click it and Unblock the Notifications