ఇట్స్ మూవీ టైమ్: ప్రేక్షకుడిలా బ్రిటన్ ప్రధాని రిషి- ఫ్యామిలీతో కలిసి సినిమా హాల్‌లో
లండన్: హాలీవుడ్‌లో బిగ్ డే. రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో ఒకటి- క్రిస్టొఫర్ నోలన్ తీసిన ఓపెన్ హైమర్. భారీ బడ్జెట్ మూవీ ఇది. ఎన్నో అంచనాల మధ్య విడుదలయింది. దానికి తగ్గట్టే కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. తొలి రోజే భారత్‌లో 20 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను రాబట్టుకుంది.
వీకెండ్ ముగిసే సరికి ఈ సంఖ్య 50 కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఒప్పెన్ హైమర్ సినిమాను సుమారు 100 మిలియన్ డాలర్లతో నిర్మించారు. మన కరెన్సీతో పోల్చుకుంటే దీని నిర్మాణ వ్యయం సుమారుగా 820 కోట్ల రూపాయలు. భారత్‌లో 1,200 స్క్రీన్లల్లో విడుదలైందీ మూవీ. తొలి రోజే 2,900 షోలు ప్రదర్శించారు.

అమెరికన్ న్యూక్లియర్ బాంబు సృష్టికర్త రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత కథ ఆధారంగా క్రిస్టొఫర్ నోలన్ ఓపెన్‌హైమర్ సినిమాను తీశారు. మన్ హట్టన్ మిషన్ నేపథ్యంలో సాగుతుందీ సైన్స్ ఫిక్షన్ మూవీ. టైటిల్ రోల్‌ను సిలియన్ మర్ఫీ పోషించారు. ఫ్లోరెన్స్, రాబర్ట్ డౌనీ, ఎమిలీ బ్లంట్, మ్యాట్ డామన్, జాక్ క్వైడ్.. ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.
రెండో సినిమా- బార్బీ. ఆస్ట్రేలియన్ స్టార్ మార్గోట్ రాబీ టైటిల్ క్యారెక్టర్‌లో మెరిశారు. రొమాంటిక్ కామెడీ జానర్ ఇది. ర్యాన్ గోస్లింగ్, దువా లిపా, సిము లియు, అరియానా గ్రీన్‌బ్లాట్, మైఖేల్ సెరా, ఎమ్మా మాకీ తదితరులు నటించారిందులో. గ్రెటా గెర్విగ్ దర్శకత్వం వహించారు. బార్బీగా నటించిన మార్గోట్ రాబీ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. తొలి రోజే 50 మిలియన్ డాలర్ల కలెక్షన్లను రాబట్టుకుంది ఈ సినిమా.

ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో హాలీవుడ్‌లో సందడి నెలకొంది. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ సైతం- ఓ సామాన్య ప్రేక్షకుడిలా మారిపోయారు. భార్యాబిడ్డలతో కలిసి సినిమాకెళ్లారు. భార్య అక్షత మూర్తి, పిల్లలు కృష్ణ సునాక్, అనౌష్క సునాక్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

ఓపెన్ హైమర్, బార్బీల్లో ఏ మూవీకి వెళ్లాలో తేల్చుకోలేకపోయారాయన. వ్యక్తిగతంగా ఓపెన్ హైమర్‌ను చూడాలనిపించినప్పటికీ ఫ్యామిలీ ఒత్తిడితో బార్బీకి ఓటు వేశారు. ఫస్ట్ ప్రయారిటీ బార్బీకే ఇచ్చారు. బార్బీ మూవీకి జైకొట్టారు రిషి సునాక్. దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి- సుధామూర్తి అల్లుడు రిషి సునాక్.












Click it and Unblock the Notifications