ఆ "లాజిక్" అర్థం కావడం లేదన్న కేంద్రమంత్రి జైశంకర్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్‌పై సుంకాలు విధించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తోందన్న ఆరోపణలే దీనికి కారణమని వాషింగ్టన్ పేర్కొంది. అయితే ఈ వాదనలను విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఖండించారు.
అమెరికా వాదనలపై ప్రశ్నలు..
జైశంకర్ వ్యాఖ్యానిస్తూ – ప్రపంచ ఇంధన మార్కెట్ స్థిరత్వం కోసం రష్యా నుంచి చమురు కొనుగోలు సహా అన్ని చర్యలు అవసరమని అమెరికా గతంలోనే స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఇప్పుడు అదే విషయాన్ని కారణంగా చూపించి భారత్‌పై సుంకాలు విధించడం విరుద్ధంగా ఉందన్నారు. అమెరికా వాదనల వెనుక ఉన్న లాజిక్ తమకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

భారత్ కాదు, చైనా పెద్ద కొనుగోలుదారు..
రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న దేశం భారత్ కాదు, అది చైనా” అని జైశంకర్ స్పష్టం చేశారు. అదేవిధంగా, యూరోపియన్ యూనియన్ కూడా అధిక మొత్తంలో ఎల్‌ఎన్‌జీ దిగుమతి చేసుకుంటోందని గుర్తు చేశారు. 2022 తర్వాత రష్యాతో వాణిజ్య వృద్ధి సాధించిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో లేదని, దక్షిణాసియా దేశాలు ముందంజలో ఉన్నాయని జైశంకర్ వివరించారు. అలాగే అమెరికా నుంచే భారత్ చమురు దిగుమతి పెంచుకుంటోందని చెప్పారు.
రష్యా పర్యటనలో జైశంకర్
ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న జైశంకర్, ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మంటురోవ్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాలు భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు కొత్త మార్గాలను అన్వేషించి కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. అలానే భారత్‌లోని వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టాలని రష్యా కంపెనీలను జైశంకర్ ఆహ్వానించారు. ఇరు దేశాల వ్యాపార సంబంధాలు మరింత విస్తరించేలా ఈ పర్యటన దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని అమెరికా ఒత్తిడి పెంచుతున్న సమయంలో జైశంకర్ మాస్కో పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది కేవలం ఇంధన రంగానికే కాకుండా వ్యాపార, రాజకీయ సంబంధాలకు కూడా కీలక మలుపుగా మారనుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications