పుతిన్ భారత పర్యటనపై చైనా బిగ్ స్టేట్‌మెంట్!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనపై చైనా మొట్టమొదటిసారిగా అధికారికంగా స్పందించింది. చైనా ఈ పర్యటనను సానుకూలంగా అభివర్ణించింది. భారత్, చైనా, రష్యా మూడు దేశాలు గ్లోబల్ సౌత్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాయని చైనా పేర్కొంది. ఈ మూడు దేశాల మధ్య బలమైన సంబంధాలు వారి సొంత ప్రయోజనాలకు మాత్రమే కాకుండా.. ఆసియా, ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వానికి కూడా చాలా అవసరమని చైనా వెల్లడించింది.
స్పందించిన చైనా విదేశాంగ శాఖ
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మూడు దేశాలు వర్థమాన ఆర్థిక వ్యవస్థలు అని.. వీటి మధ్య విశ్వాసం, స్థిరత్వం ప్రపంచ స్థాయిలో సానుకూల ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. చైనా భారత్, రష్యా రెండింటితో కలిసి సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. చైనా రష్యాతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటున్న సమయంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. పుతిన్ భారత పర్యటనను చైనా చాలా జాగ్రత్తగా గమనించింది.

పుతిన్ ప్రకటనకు ప్రాధాన్యత
తన పర్యటనకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ కూడా భారత్, చైనా రెండూ రష్యాకు సన్నిహిత మిత్రదేశాలని, ఈ సంబంధాలకు రష్యా చాలా ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు. చైనీస్ మీడియా పుతిన్ చేసిన ఈ ప్రకటనకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ముఖ్యంగా భారత్, చైనాల మధ్య ఏ విషయంలోనూ జోక్యం చేసుకునే హక్కు రష్యాకు లేదని, రెండు దేశాలు తమ విభేదాలను సొంతంగా పరిష్కరించుకోగలవని పుతిన్ అన్న భాగాన్ని ప్రముఖంగా చూపింది.
భారత్-చైనా సంబంధాలు
తూర్పు లడఖ్ సరిహద్దు వివాదం కారణంగా గత కొంతకాలంగా భారత్-చైనా సంబంధాలు సున్నితంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు తాము దీర్ఘకాలిక దృక్పథంతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నామని చైనా పేర్కొంది. బీజింగ్ ప్రతినిధి గువో మాట్లాడుతూ, చైనా భారతదేశంతో స్థిరమైన, బలమైన సంబంధాలను నిర్మించడానికి సిద్ధంగా ఉందని.. ఇది రెండు దేశాలకు, ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. మూడు దేశాల మధ్య పెరుగుతున్న సహకారం ఆసియా, ప్రపంచ స్థిరత్వానికి సానుకూల సహకారాన్ని అందిస్తుందని ఆయన చెప్పారు.
రష్యా-భారత్ ఒప్పందాలపై చైనా స్పందన
పుతిన్ పర్యటన సందర్భంగా భారత్- రష్యా అనేక ఆర్థిక, వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకున్నాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యాన్ని కూడా నిర్దేశించాయి. ఈ పరిణామాలను చైనా ప్రాంతీయ స్థిరత్వం, ఆర్థిక బలోపేతం దిశగా సానుకూల చర్యగా అభివర్ణించింది.












Click it and Unblock the Notifications