CoronaVac: పిల్లలకే కాదు..యుక్త వయస్సు వారికి కూడా: చైనా వ్యాక్సిన్ సేఫ్
బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారికి జన్మనిచ్చినట్టుగా భావిస్తోన్న డ్రాగన కంట్రీ చైనా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్.. ఇప్పుడు పిల్లల కోసం వినియోగించడానికి అవకాశం ఏర్పడింది. పిల్లలతో పాటు యుక్త వయస్సు వచ్చిన వారికి అంటే 18 ఏళ్ల లోపు వారి కోసం చైనా అభివృద్ధి చేసిన కరోనావ్యాక్ (CoronaVac) సేఫ్‌గా తేలింది. దీనికి సంబంధించిన మెడికల్ అండ్ రీసెర్చ్ డేటాను లాన్సెట్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ జర్నల్ ప్రచురించింది. మూడేళ్ల నుంచి 17 సంవత్సరాల్లోపు వయస్సున్న వారిపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ సందర్భంగా ఈ విషయం నిరూపితమైందని స్పష్టం చేసిందా జర్నల్.

96 శాతం మందిలో యాంటీ బాడీస్..
550 మంది పిల్లలు, యుక్త వయస్సు వచ్చిన వారిపై ర్యాండమ్‌గా ఈ క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించారు. వారిలో 96 శాతం మందికి రెండో డోసుల కరోనావ్యాక్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తరువాత వారి శరీరంలో సంభవించిన పరిణామాలపై అధ్యయనం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం వారిలో సార్స్-సీవోవీ-2ను ప్రతిఘటించే, నిలువరించే యాంటీబాడీస్ అభివృద్ధి చెందినట్లు గుర్తించారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా లేవని నిపుణులు నిర్ధారించారు.

సైడ్ ఎఫెక్ట్స్ తక్కువే..
ఈ టీకా వల్ల కలిగే అత్యున్నత స్థాయి సైడ్ ఎఫెక్ట్- ఇంజెక్షన్ చేసిన చోట నొప్పి, జ్వరం రావడం మాత్రమేనని, ఇది అన్ని వ్యాక్సిన్ల వల్ల కూడా సంభవిస్తుందని స్పష్టం చేశారు. కరోనావ్యాక్ టీకా తీసుకున్న తరువాత.. వారిలో యాంటీబాడీస్ బలోపేతమైనట్లు నిపుణులు నిర్ధారించారు. పిల్లలు-యుక్త వయస్సుకు వచ్చిన వారిపై కరోనావ్యాక్స వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో నిర్వహించారు. ఒకటిన్నర, మూడు మైక్రోగ్రాముల మేర వ్యాక్సిన్ డోసును ఇంజెక్ట్ చేశారు.

అక్టోబర్ నుంచీ
తొలిదశ క్లినికల్ ట్రయల్స్‌లో ఒకటిన్నర, మూడు మైక్రోగ్రాముల మేర వ్యాక్సిన్ డోసును వేర్వేరు గ్రూపులకు ఇంజెక్ట్ చేయగా.. వారిలో వందశాతం మేర యాంటీబాడీస్ అభివృద్ధి చేందినట్లు లాన్సెట్ జర్నల్ తెలిపింది. రెండో విడత ట్రయల్స్‌లో- ఒకటిన్నర మైక్రో గ్రాముల మేర కరోనావ్యాక్ డోసును ఎక్కించిన వారిలోనూ వందశాతం మేర ప్రభావం కనిపించింది. అనంతరం- కొన్ని రకాల పరీక్షలను నిర్వహించిన తరువాత.. కరోనావ్యాక్ వ్యాక్సిన్‌ను మూడేళ్ల నుంచి 17 సంవత్సరాల్లోపు వయస్సున్న వారికి వినియోగించడానికి ఉపకరిస్తుందని నిర్ధారించినట్లు లాన్సెట్ జర్నల్ పేర్కొంది.

సినోవాక్ వ్యాక్సిన్..
సినోవాక్ లైఫ్ సైన్సెస్ కంపెనీ లిమిటెడ్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఇది. ఈ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం కావడం వల్ల సినోవాక్ లైఫ్ సైన్సెస్ అధినేత క్వియాంగ్ గావో హర్షం వ్యక్తం చేశారు. పిల్లలు, యుక్త వయస్సుల వారికి కరోనా వైరస్ బారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా తాము కరోనావ్యాక్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. దేశ జనాభాలో అత్యధిక శాతం మంది మూడు నుంచి 17 సంవత్సరాల్లోపు వయస్సున్న వారు ఉన్నారని, వారిలో రోగ నిరోధక శక్తిని మరింత బలోపేతం చేసేలా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయగలిగామని అన్నారు.












Click it and Unblock the Notifications