7.3 తీవ్రతతో తీరంలో భారీ భూకంపం
Alaska earthquake 2025: అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. తీర ప్రాంత నగరంలో భూమి ప్రకంపించడం వల్ల సముద్రం పోటెత్తింది. అల్లకల్లోలానికి గురైంది. తీర ప్రాంతంలో అలలు ఎగిసిపడ్డాయి. సునామీ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. ఆ తరువాత దాన్ని ఉపసంహరించుకున్నారు. భూకంప తీవ్రత నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. తీరాన్ని ఖాళీ చేయించారు.
రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున 2:07 నిమిషాలకు భూమి ప్రకంపించింది. అలస్కా వాయవ్యదిశలో 54.91 నార్త్ అక్షాంశం, 160.56 వెస్ట్ రేఖాంశం వద్ద గల ప్రాంతం గల ఉన్న శాండ్ పాయింట్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నేషనల్ వెదర్ సర్వీస్. సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఆ తరువాత ఈ హెచ్చరికను అడ్వైజరీగా తగ్గించినట్లు ఆ సంస్థ తెలిపింది. అలాస్కాకు వాయువ్య పోపోఫ్ ద్వీపంలో ఉంటుందీ. శాండ్ పాయింట్. ఇది అలాస్కాలోని యాంకరేజ్ కు నైరుతి దిశలో సుమారు 600 మైళ్ల దూరంలో ఉండే పర్యాటక ప్రదేశం.
ఉపరితలం నుంచి 36 కిలోమీటర్ల దిగువన టెక్టోనిక్ ప్లేట్స్ లల్లో సంభవించిన పెను కదలికల వల్ల భూమి ఈ స్థాయిలో ప్రకంపించినట్లు యూఎస్ జీఎస్ తెలిపింది. పసిఫిక్ తీరంలోని దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పం మొదలుకుని కెన్నడీ ఎంట్రన్స్, యునిమాక్ పాస్, అలాస్కా వరకు సునామీ అడ్వైజరీ అమలులో ఉంది.
శాండ్ పాయింట్ తో పాటు అలస్కా నగరాలైన కోల్డ్ బే, కొడియాక్ కూడా సునామీ అడ్వైజరీ పరిధిలో ఉన్నాయి. భూకంపం సంభవించడం, ఆ కొద్దిసేపటికే సునామీ హెచ్చరికలు జారీ కావడంతో కోల్డ్ బే, కొడియాక్ నగరాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. సైరన్ మోగించారు. తీర ప్రాంతాలను ఖాళీ చేయించారు.
ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు జారీ చేసినట్లు కొడియాక్ పోలీసులు వెల్లడించారు. ఆ దేశ కాలమానం ప్రకారం కొడియాక్, కోల్డ్ బే ప్రాంతంలో సునామీ ప్రభావం మధ్యాహ్నం 2:40 గంటల వరకు ఉంటుందని అంచనా వేస్తోన్నారు. భూకంపం వల్ల కొడియాక్ సిటీ ఎలాంటి నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.
కోల్డ్ బే సిటీ సునామీ అడ్వైజరీ పరిధిలో ఉన్నప్పటికీ, ఆ ప్రాంతం మొత్తం కూడా సముద్ర మట్టానికి 100 అడుగుల ఎత్తులో ఉన్నందున ఆందోళన చెందట్లేదని స్థానికులు తెలిపారు.
ఇది షాలో భూకంపం. లోతు తక్కువగా ఉండే భూకంపాలను షాలోగా పరిగణిస్తారు. సాధారణ భూకంపాల కంటే ఇవి మరింత ప్రమాదకరం. ఒక్కసారి షాలో ఎర్త్ క్వెక్ సంభవించిందంటే.. ప్రధాన ప్రకంపం తర్వాత కూడా ప్రకంపనలు సంభవిస్తుంటాయి. దీనివల్ల నష్టం అధికంగా ఉంటుంది. భూ ఉపరితలానికి దగ్గరగా ఉన్నప్పుడు ఇలాంటి భూకంపాలు ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి. ఎక్కువ విధ్వంసాన్ని కలిగిస్తాయి.
నిజానికి రింగ్ ఆఫ్ ఫైర్ దేశాల్లో అమెరికా ఒకటి కావడం వల్ల తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. బొలీవియా, చిలీ, ఈక్వెడార్, పెరూ, కోస్టారికా, గ్వాటెమాల, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, న్యూజిలాండ్, అంటార్కిటికా రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉండే దేశాలు.












Click it and Unblock the Notifications