విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్: వీడియో తీసి బెదిరించారు
లాహోర్: పాకిస్థాన్‌లోని లాహోర్‌లో దారుణం జరిగింది. ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థినిపై ఆమె సహచర విద్యార్థితోపాటు అతని ముగ్గురు స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక అత్యాచారాన్ని చిత్రీకరించిన నిందితులు, ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామంటూ బెదిరింపులకు గురి చేశారు.
బాధితురాలు యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థిగా పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీనియర్ పోలీసు అధికారి అసద్ ముజాఫర్ తెలిపారు.

కొన్ని నెలల క్రితం తన సహచర విద్యార్థి తనను వివాహం చేసుకుంటానని చెప్పి, అతని తల్లి చూడాలని కోరుకుంటుందని ఓ ఇంటికి తీసుకెళ్లాడని బాధితురాలు తెలిపింది. ఆ ఇంట్లోకి తీసుకెళ్లిన తర్వాత అతను తనపై అత్యాచారం చేశాడని, అంతేగాక అతని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.
ఆ వీడియోను నెట్‌లో పెడతానని బెదిరింపులకు గురి చేస్తూ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, అతని ముగ్గురు స్నేహితులు కూడా తనను అత్యాచారం చేశారని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై పాకిస్థాన్ పీనల్ కోడ్ ప్రకారం 292, 376 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications