737 మంది భారతీయులకు పాకిస్తాన్ వీసాలు..! రీజన్ ఇదే..!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. దీంతో ఇరు దేశాల్లోని కొన్ని పవిత్ర స్థలాలకు వెళ్లే యాత్రికుల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ హైకమిషన్ ఇవాళ ఏకంగా 737 మంది భారతీయులకు తమ దేశం వచ్చేందుకు వీలుగా వీసాలు మంజూరు చేసింది. దీంతో వీరంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరంతా పాకిస్తాన్ (Pakistan)కు ఎందుకు వెళ్తున్నారంటే..
గురు అర్జున్ దేవ్ జీ అమరత్వ దినోత్సవం సందర్భంగా జూన్ 10-19 తేదీలలో పాకిస్థాన్లో వార్షిక ఉత్సవాలు జరుగుతాయి. వీటిలో పాల్గొనేందుకు భారత్ నుంచి సిక్కులు వెళ్తుంటారు. ఈసారి కూడా అక్కడికి వెళ్లేందుకు పాకిస్తాన్ హై కమిషన్ కు వీరంతా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఈ 737 మందికి వీసాలు మంజూరు చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని భారత్ లోని పాకిస్తాన్ హై కమిషన్ ఇవాళ ట్వీట్ చేసింది.

The Pakistan High Commission in New Delhi has issued 737 visas to pilgrims from India to participate in the annual festival scheduled on the eve of Martyrdom Day of Guru Arjun Dev Ji to be held in Pakistan from 10-19 June 2026: Pakistan High Commission, India pic.twitter.com/MawQqzgNf2
— ANI (@ANI) June 8, 2026
గతంలోనూ పలుమార్లు పాకిస్తాన్ లో ఉన్న సిక్కు పవిత్ర స్దలాలకు ఇక్కడి సిక్కులు వెళ్లేందుకు వీలుగా ఇలా వీసాలు జారీ చేసారు. కానీ మారిన పరిస్ధితుల్లో వీరికి ఈసారి వీసాలు లభిస్తాయా లేదా అన్న టెన్షన్ లో ఉన్నారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం మతపరమైన అంశం కాబట్టి మానవతా దృక్పథంతో వీరికి వీసాలు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ పహల్గాం ఉగ్రదాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో భారత్-పాకిస్తాన్ ఉప్పూనిప్పుగానే ఉంటున్నాయి. భారత విమానాలకు పాకిస్తాన్ గగన తలంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అలాగే పాకిస్తాన్ కు సింధు నదీ జలాల్ని భారత్ వదలడం లేదు.












Click it and Unblock the Notifications