24 గంటల్లోనే 63 మంది మృతి.. కారణం ఏంటంటే ?
పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలో గత 24 గంటలుగా కురుస్తున్న కుండపోత వర్షాలు పెను విధ్వంసం సృష్టించాయి. ఈ భీకర వర్షాల ధాటికి బుధవారం ఉదయం నుంచి కనీసం 63 మంది మరణించగా.. 290 మందికి పైగా గాయపడ్డారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) ప్రకటించింది. మృతుల్లో సగానికి పైగా పిల్లలు ఉండటం మరింత ఆవేదనకు గురిచేస్తోంది.
బీభత్సం సృష్టించిన వర్షాలు..
కూలిపోయిన భవనాల శిథిలాల కింద చిక్కుకొని చాలా మంది ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారు వరద నీటిలో మునిగి లేదా విద్యుత్ షాక్ తగిలి మరణించారు. రాజధాని ఇస్లామాబాద్ పక్కనే ఉన్న రావల్పిండి నగరంలో అధికారులు గురువారం సెలవు దినంగా ప్రకటించారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఏడాది జూన్ చివరిలో రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి పాకిస్థాన్ దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య దాదాపు 180కి చేరింది. ఈ భారీ వర్షాల కారణంగా పంజాబ్‌లో పలు ఎక్స్‌ప్రెస్‌వేలను వరదలు ముంచెత్తడంతో మూసివేశారు. అనేక విమానాలు సైతం రద్దు చేయగా.. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
అత్యవసర పరిస్థితి, సహాయక చర్యలు..
పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు తెలిపారు. ప్రభుత్వ సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని, ప్రజలు భద్రతా మార్గదర్శకాలను పాటించాలని ఆమె ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
చక్వాల్ నగరంలో 400 మి.మీ వర్షపాతం నమోదైంది. సహాయక బృందాలు వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పడవలను ఉపయోగిస్తున్నాయి. సైనిక హెలికాప్టర్లు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తూ, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది సహాయక సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
వాతావరణ మార్పుల ప్రభావం..
దాదాపు 25 కోట్ల జనాభా కలిగిన పాకిస్థాన్ వాతావరణ మార్పులకు గురయ్యే ప్రమాదం ఉన్న దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అధిక ఉష్ణోగ్రతలు, కరువుకు ఒక వాతావరణ వ్యవస్థ కారణమైతే, మరొకటి రుతుపవనాలను తీసుకువస్తుంది. పాకిస్థాన్‌లో 13,000 కంటే ఎక్కువ హిమానీనదాలు వేగంగా కరుగుతున్నాయి, ఇది వరదల తీవ్రతకు ప్రధాన కారణమవుతోంది.
2022లో సంభవించిన వరదల్లో దేశంలో మూడవ వంతు నీట మునిగి 1,700 మందికి పైగా మరణించారు. దీనివల్ల దేశానికి 30 బిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లింది. 2023లో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ మాట్లాడుతూ, విపత్తుల నుండి కోలుకోవడానికి అంతర్జాతీయ సమాజం పాకిస్థాన్‌కు సహాయం చేయాలని కోరారు. వాతావరణ మార్పులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కారణంగా పాకిస్థాన్ రెట్టింపు నష్టపోయిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications