'హార్ముజ్' గేట్లు ఓపెన్.. కనికరించిన ఇరాన్ - ఇక లైన్ క్లియర్..!!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత ముఖ్యమైన మార్గాలలో ఒకటైన హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయంగా పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించిన ప్రకారం.. అన్ని వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతి ఇస్తూ హర్మూజ్ జలసంధిని తిరిగి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చినట్టు స్పష్టం చేశారు. లెబనాన్‌లో పరిస్థితులు శాంతించడంతో పాటు.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నంత వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా ప్రకటించారు.

హర్మూజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఆయిల్ ట్రాన్సిట్ మార్గాలలో ఒకటి. ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద శాతం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. కాబట్టి ఈ మార్గం మూసివేయబడితే అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీన్ని మళ్లీ తెరవడం వల్ల గ్లోబల్ ఆయిల్ ధరలు స్థిరపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఇరాన్ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సమన్వయంలో నౌకల రాకపోకలు సజావుగా సాగుతాయని అధికారులు తెలిపారు. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తూ, అంతర్జాతీయ నౌకాయానానికి ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిణామంపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ఇరాన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, "హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడం మంచి పరిణామం. దీనివల్ల ప్రపంచ వాణిజ్యానికి ఊరట లభిస్తుంది" అని వ్యాఖ్యానించారు. ఇరాన్‌కు ధన్యవాదాలు కూడా తెలిపారు.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ నిర్ణయం కేవలం తాత్కాలిక శాంతికి సంకేతం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో అమెరికా-ఇరాన్ మధ్య శాశ్వత శాంతి ఒప్పందానికి కూడా మార్గం సుగమం చేయవచ్చని భావిస్తున్నారు. ఇక హర్మూజ్ జలసంధి తిరిగి తెరవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ఇంధన రంగానికి భారీ ఊరటనిచ్చే నిర్ణయంగా నిలిచింది.
ఇటీవల ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించడం గమనార్హం. ఈ పరిణామం ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడమే కాకుండా, అంతర్జాతీయ వాణిజ్య మార్గాల భద్రతకు కూడా దోహదపడిందని భావిస్తున్నారు. ఈ పరిణామం ప్రాంతీయ శాంతికి ఒక పాజిటివ్ సిగ్నల్‌గా భావించబడుతోంది.












Click it and Unblock the Notifications