ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ!
శనివారం తెల్లవారుజామున ఇండోనేషియాలో ఫ్లోరెస్ ద్వీప సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే, ఇండోనేషియా అధికారులు ధ్రువీకరించారు. భూకంప ప్రకంపనలు రావడంతో వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీనితో భయాందోళనకు గురైన వందలాది మంది ప్రజలు తమ ఇళ్లను, ఆస్పత్రులను వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.
యూఎస్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం.. ఈ లోతు తక్కువ భూకంప కేంద్రం ఫ్లోరెస్ ద్వీపంలోని 'ఎండే' పట్టణానికి వాయవ్యంగా 68 కిలోమీటర్ల దూరంలో ఉత్తర తీరంలో నమోదైంది. ప్రధాన భూకంపం వచ్చిన కొద్ది సేపటికే అదే ప్రాంతంలో వరుసగా భారీ ప్రకంపనలు సంభవించాయి. ఇందులో 5.6, 5.9, 6.1 తీవ్రత కలిగిన భారీ ప్రకంపనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. భవనాలు బలంగా ఊగిపోవడంతో ఆస్పత్రుల్లోని రోగులు బయటకు పరుగులు తీశారని.. అనేక చోట్ల గోడలు పగుళ్లు వచ్చాయని స్థానికులు వెల్లడించారు. ఈ భూకంపం సముద్ర గర్భంలో సంభవించడం వల్ల ఇండోనేషియా మైదాన ప్రాంతాల్లో దీని ప్రభావం ఎంతవరకు ఉందనేది ఇంకా పూర్తిగా స్పష్టం కాలేదు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్లు నివేదికలు లేవు. అత్యవసర సహాయక బృందాలు, స్థానిక పాలనా యంత్రాంగం నిశితంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.

సునామీ హెచ్చరికలు జారీ
ఈ భూకంపం కారణంగా సముద్రంలో సునామీ అలలు ఎగసిపడే అవకాశం ఉందని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక సంస్థ(BMKG) హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పు నుసా తెంగ్గారా, దక్షిణ సులవేసి, పశ్చిమ నుసా తెంగ్గారా ప్రాంతాల్లో 0.5 మీటర్ల నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు అలలు వచ్చే ప్రమాదం ఉందని BMKG డైరెక్టర్ విజయంతో వెల్లడించారు. మౌమేరే పట్టణంలో సముద్ర నీరు వెనక్కి తగ్గడం ప్రారంభమైంది. ఇది సాధారణంగా సునామీకి ముందు కనిపించే ప్రధాన సంకేతం. ప్రస్తుతం తీరంలో 19 నుంచి 30 సెంటి మీటర్ల ఎత్తు వరకు అలల ప్రభావం నమోదైంది.
పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రభావం
ఇండోనేషియా భౌగోళికంగా పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్'ప్రాంతంలో ఉండటంతో ఇక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనలు జరుగుతుంటాయి. గతంలో కూడా ఈ దేశం అనేక భారీ భూకంపాలను చవిచూసింది. 2004లో సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం భారీ సునామీకి దారితీసి దాదాపు 2,20,000 మందిని బలిగొంది. 2018లో లాంబోక్ ద్వీపంలో వచ్చిన భూకంపాల వల్ల 550 మందికి పైగా మరణించారు. 2018లో సులవేసిలోని పాలూ ప్రాంతంలో 7.5 తీవ్రతో భూకంపం, సునామీ వల్ల 4,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఆస్ట్రేలియాకు తప్పిన సునామీ ముప్పు
మరోవైపు ఈ భూకంపం వల్ల తమ ప్రధాన భూభాగానికి గానీ, అనుబంధ ద్వీపాలకు గానీ ఎలాంటి సునామీ ముప్పు లేదని ఆస్ట్రేలియా సునామీ హెచ్చరికల సంస్థ స్పష్టం చేసింది. అయిత, పొరుగున ఉన్న ఇండోనేషియాలో విపత్తు సంభవిస్తే సహాయక చర్యలు అందించేందుకు ఆస్ట్రేలియా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.












Click it and Unblock the Notifications