ముందు జాగ్రత్తలో జపాన్.. ఉత్తరకొరియాకు సమీపంగా క్షిపణి రక్షణ వ్యవస్థ తరలింపు!
ఉత్తరకొరియా దుందుడుకు చర్యల నేపథ్యంలో జపాన్ ముందు జాగ్రత్త చర్యలకు దిగింది. తన మొబైల్ క్షిపణి రక్షణ వ్యవస్థను మంగళవారం తూర్పు తీరంలోని హోక్కైడో ద్వీపానికి తరలించి అక్కడ మొహరించింది.
టోక్యో: ఉత్తరకొరియా దుందుడుకు చర్యల నేపథ్యంలో జపాన్ ముందు జాగ్రత్త చర్యలకు దిగింది. తన మొబైల్ క్షిపణి రక్షణ వ్యవస్థను మంగళవారం తూర్పు తీరానికి తరలించింది. గతవారం ఉత్తర కొరియా పరీక్షించిన ఖండాంతర క్షిపణి ప్రయాణించిన హోక్కైడో ద్వీపంలో ఈ వ్యవస్థను మొహరించింది.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధునాత పాట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థను దక్షిణ హోక్కైడో ద్వీపంలోని హకేడేట్ లాంచింగ్ స్టేషన్‌కు తరలించినట్లు జపాన్ రక్షణ మంత్రి సునారియో నోడెరా ప్రకటించారు.

అప్రమత్తమైన జపాన్...
నెల రోజుల వ్యవధిలోనే ఉత్తరకొరియా పరీక్షించిన రెండు బాలిస్టిక్ ఖండాంతర క్షిపణులు జపాన్ లోని హోక్కైడో ద్వీపం మీదుగా ప్రయాణించి పసిఫిక్ సముద్రంలో కూలిపోయిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన జపాన్ మంగళవారం తన క్షిపణి రక్షణ వ్యవస్థను హోక్కైడో ద్వీపానికి తరలించాని నిర్ణయించింది.

హోక్కైడో ద్వీపానికి క్షిపణి రక్షణ వ్యవస్థ...
ఈ క్షిపణి వ్యవస్థను హోక్కైడో ద్వీపం యుకుమో పట్టణంలోని 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హకేడేట్ ప్రాంతానికి తరలించారు. 20 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది సమర్థవంతంగా ఛేదిస్తుంది. 34 పీఏసీ-3 పేరుతో పిలిచే ఈ క్షిపణులను ఎక్కువగా రాజధాని ప్రాంతంలో జపాన్ వినియోగిస్తోంది.

ఉత్తరకొరియా దాడికి దిగితే...
అయితే అమెరికాను లక్ష్యంగా చేసుకుని ఉత్తర కొరియా తరచూ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వీటిని జపాన్ తన దేశంలోని వాయవ్య ప్రాంతానికి తరలించింది. ఒకవేళ ఉత్తరకొరియా తమ దేశాన్ని కూడా టార్గెట్ చేస్తే.. దీటుగా ఎదుర్కొనేందుకు ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ ఉపయోగపడుతుంది.

రెండంచెల రక్షణ వ్యవస్థ...
ప్రస్తుతం జపాన్ రెండంచెల క్షిపణి రక్షణ వ్యవస్థను కలిగి ఉంది. శత్రువులు దాడిచేస్తే వారి యుద్ధ విమానాలను, క్షిపణులను సముద్రం నుంచే కూల్చివేయడానికి స్టాండర్డ్ మిసైల్-3 క్షిపణులను వినియోగించడం మొదటి అంచె. ఇది విజయవంతం కాకపోతే ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే పీఏపీ-3 క్షిపణులను ప్రయోగిస్తుంది.

స్వీయ రక్షణ కోసం...
స్వీయరక్షణ కోసం జపాన్ తన సైన్యాన్ని అతి తక్కువగా వినియోగిస్తోంది. కేవలం తమ దేశం మీదుగా ఏవైనా క్షిపణులు ప్రయాణించినా లేదా దాడిచేసిన సందర్భాల్లో మాత్రమే వారికి అనుమతిస్తుంది. 2015లో ఆమోదించిన కొత్త రక్షణ చట్టం ప్రకారం... జపాన్, దాని మిత్రదేశం అమెరికా భద్రతకు ప్రమాదకరంగా మారితే క్షిపణులను ప్రయోగించవచ్చని జపాన్ రక్షణ మంత్రి సునారియో తెలియజేశారు.












Click it and Unblock the Notifications