బ్రిక్స్ సదస్సుకు మోడీ, బెర్లిన్‌లో బస, జిన్‌పింగ్‌తో భేటీ
బెర్లిన్: అంతర్జాతీయ అంశాలలో భారత్ చురుకైన పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్తూ ఆయన మార్గమధ్యలో బెర్లిన్‌లోని సైనిక విమానాశ్రయంలో దిగారు. ఆదివారం బెర్లిన్‌లో బస చేసి సోమవారం బ్రెజిల్ వెళ్తున్నారు. అంతకుముందు ఆయన ఢిల్లీలో మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వాన్ని ముందుకు తీసుకెళుతూనే, శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించడానికి ప్రాంతీయ సంక్షోభాలు, భద్రత ముప్పును పరిష్కరించే అంశాలపై బ్రిక్స్ సదస్సులో భారత్ చర్చిస్తుందన్నారు.
ఈ నెల 15, 16 తేదీల్లో బ్రెజిల్‌లోని ఫోర్టాలిజా, బ్రెజీలియాల్లో ఆరవ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) సదస్సు జరగనుంది. బ్రిక్స్ సదస్సుకు రావాలంటూ ప్రధాన మంత్రి మోడీని బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రూసెఫ్ ఆహ్వానించారు. ఈ మేరకు ఆదివారం ఢిల్లీ నుంచి బయల్దేరిన ఆయన రాత్రి బెర్లిన్‌లో ఆగారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఒకేసారి వివిధ దేశాల సందర్శనకు వెళ్లడం, పెద్ద సంఖ్యలో ప్రపంచ నేతలను కలుసుకోవడం మోడీకి ఇదే తొలిసారి.
బెర్లిన్‌లో ఆయనకు భారత రాయబారి విజయ్ గోఖలే, జర్మనీ విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. బ్రిక్స్ అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు అంశం ఈ సదస్సులోనే ఖరారు కాగలదని ఈ సందర్భంగా చెప్పారు. దీంతోపాటు ఆగంతుక నిధి ఏర్పాటుపై ఒప్పందంమీదా ఆశాభావం వ్యక్తం చేశారు. వంద మిలియన్ అమెరికన్ డాలర్ల కార్పస్ ఫండ్‌తో బ్రిక్స్ డెవలప్‌మెంట్ బ్యాంకును ఏర్పాటు చేయనున్నారు.

అయితే, దాని ప్రధాన కార్యాలయాన్ని న్యూఢిల్లీలో కానీ షాంఘైలోగానీ ఏర్పాటు చేయాలని భారత్, చైనా డిమాండ్ చేస్తున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో రాజకీయ సంక్షోభం, ఘర్షణలు జరుగుతున్న సమయంలో ఈ సదస్సు జరుగుతోందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కూడా అలజడి, బలహీనత ఉన్నాయని, వీటన్నిటినీ అధిగమించి ప్రపంచ శాంతికి ఏమేం చేయాలనే అంశాలపై బ్రిక్స్‌లో చర్చిస్తామని మోడీ తెలిపారు.
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో మోడీ తొలిసారి భేటీ కానున్నారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా జరగనున్న ఈ సమావేశంలో భారత్‌లో చైనా పారిశ్రామిక పార్కుల ఏర్పాటు, భారత్‌కు చెందిన మరిన్ని ఉత్పత్తులకు చైనా గేట్లు తెరిచి వాణిజ్య కొరతను పూడ్చడం వంటి అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు. ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య అంశాలతోపాటు వ్యూహాత్మక అంశాలపైనా వీరి మధ్య చర్చలు సాగుతాయని అధికార వర్గాలు వివరించాయి. వీరిద్దరి భేటీ 15వ తేదీన జరిగే అవకాశముంది.












Click it and Unblock the Notifications