చుక్క రక్తం కోసం అల్లాడుతున్న దేశం.. రెడ్ క్రాస్ చరిత్రలోనే రెండోసారి
అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలోనే అధునాతన వైద్య సదుపాయాలు ఉన్న అమెరికాను ఇప్పుడు ఒక అనూహ్య భయం వెంటాడుతోంది. దేశవ్యాప్తంగా రక్తం నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో 'అమెరికన్ రెడ్ క్రాస్' సంస్థ ఏకంగా నేషనల్ బ్లడ్ సప్లై క్రైసిస్ ప్రకటించింది. నిమిషం లేట్ అయినా ప్రాణాలు పోయే అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చే 'O - పాజిటివ్' బ్లడ్ గ్రూప్ నిల్వలు దేశమంతటా కలిపినా కనీసం ఒక్క రోజుకు కూడా సరిపోవని తెలియడంతో హాస్పిటళ్లు, వైద్య వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
చరిత్రలోనే రెండోసారి.. ఎందుకీ పరిస్థితి?
రెడ్ క్రాస్ సంస్థ తన సుదీర్ఘ చరిత్రలోనే ఇలా జాతీయ స్థాయి రక్త సంక్షోభాన్ని ప్రకటించడం ఇది కేవలం రెండోసారి మాత్రమే! గతంలో 2022లో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి అత్యవసర పరిస్థితి వచ్చింది. వేసవి తీవ్రత పెరగడం, అడవుల్లో కార్చిచ్చు మూలంగా ఎగసిపడిన పొగ వల్ల వాయు కాలుష్యం పెరగడం, వాతావరణ మార్పుల వల్ల జనం అనారోగ్యం బారిన పడటంతో రక్తదానం చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. జూన్ నెల నుంచే దాదాపు 25 శాతం దాకా రక్త సేకరణ పడిపోవడంతో ఈ రోజు పరిస్థితి తీవ్రరూపం దాల్చింది.

ఆ ఒక్క బ్లడ్ గ్రూప్‌కే తీవ్ర డిమాండ్!
ముఖ్యంగా 'O - పాజిటివ్' బ్లడ్ గ్రూప్ దొరకక ఆసుపత్రులు అల్లాడిపోతున్నాయి. అత్యవసరంగా ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు, వారి బ్లడ్ గ్రూప్ ఏంటో తెలియనప్పుడు ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్లు ఇచ్చేది ఈ గ్రూప్ రక్తమే. సమాజంలో దాదాపు 80 శాతం మందికి ఈ రక్తం సురక్షితంగా సరిపోతుంది. కానీ ప్రస్తుతం ఈ గ్రూప్ నిల్వలు శూన్యానికి చేరువ కావడంతో, అత్యంత ప్రాణాంతక స్థితిలో ఉన్నవారికి మాత్రమే ఈ రక్తాన్ని వాడాలని, మిగతా వాటికి వేచి చూడాలని రెడ్ క్రాస్ స్పష్టం చేసింది.
పక్క దేశానికీ పాకిన మంటలు!
ఈ రక్త నిల్వల కొరత కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. పొరుగునే ఉన్న కెనడాలోనూ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. అక్కడ జూన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు దాదాపు 20 శాతానికి పైగా రక్త నిల్వలు పడిపోవడంతో 'కెనడియన్ బ్లడ్ సర్వీసెస్' కూడా ప్రజలకు అత్యవసర పిలుపునిచ్చింది. బ్లడ్ బ్యాంకులు ఖాళీ అవుతుండటంతో ప్రాణాలు కాపాడటానికి అందరూ ముందుకు రావాలని కోరుతోంది.
ఆపరేషన్లు వాయిదా వేసే యోచనలో ఆసుపత్రులు
రక్త నిల్వలు రోజురోజుకూ క్షీణిస్తుండటంతో అత్యవసరం కాని శస్త్రచికిత్సలు, రోజూవారీ వైద్య సేవలను కొంతకాలం వాయిదా వేయాలని ఆసుపత్రులు భావిస్తున్నాయి. రోజుకు సగటున అవసరమయ్యే పరిమాణం కంటే 3,500 యూనిట్ల రక్తం అదనంగా కావాల్సి వస్తోందని, కానీ దాతలు రావడం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్లడ్ ప్రాసెస్ చేసిన తర్వాత గరిష్టంగా 42 రోజులు మాత్రమే నిల్వ ఉంచే వీలుండటంతో, ముందుగానే భారీగా దాచిపెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.
ముందుకు రండి.. ఆఫర్లు ఇస్తాం!
ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు రెడ్ క్రాస్ సంస్థ ప్రజలను ఉదారంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తక్షణమే రక్తదానం చేయడానికి ముందుకు వచ్చేవారికి వినూత్న ఆఫర్లు ప్రకటిస్తోంది. జులై చివరి నాటికి రక్తం ఇచ్చే వారికి సినిమా టికెట్లను, ఆగస్టు నెలలో రక్తదానం చేసేవారికి 20 డాలర్ల విలువైన అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌లను అందిస్తామని ఆఫర్ ఇచ్చింది. ఏది ఏమైనా, తక్షణమే దాతలు స్పందించకపోతే వైద్య రంగంలో పెను ప్రమాదం ముంచుకొచ్చేలా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications