మీరు కాకపోతే ఇంకెవరు ఆదుకుంటారు..? భారత్ ను వేడుకున్న ముస్లిం దేశం
గాజా, వెస్ట్ బ్యాంక్ పరిధిలోని పాలస్తీనా ప్రాంతాల్లో ఆరోగ్య రంగం అత్యంత దారుణమైన స్థితికి చేరుకుందని, తక్షణమే అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని భారత్ లోని పాలస్తీనా రాయబార కార్యాలయం అత్యవసర పిలుపునిచ్చింది. నిరంతర దాడులు, వైద్య మౌలిక సదుపాయాల ధ్వంసం, తీవ్ర ఆర్థిక ఆంక్షల వల్ల అక్కడి ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే స్థితికి చేరిందని రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది.
ఆపదలో ఉన్న వర్థమాన దేశాలకు విపత్తులు, మానవతా సంక్షోభాల సమయాల్లో వైద్య సాయం అందించేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన 'ఆరోగ్య మైత్రి' పథకం కింద పాలస్తీనాకు అత్యవసర వైద్య సామగ్రిని పంపించాలని విజ్ఞప్తి చేసింది. మానవతా విలువలు, ప్రపంచ శాంతి, సామాజిక న్యాయం పట్ల భారత్ కు ఉన్న చారిత్రక నిబద్ధతను ఈ సందర్భంగా గుర్తుచేస్తూ, వేలాది మంది అమాయక పాలస్తీనా పౌరుల ప్రాణాలను కాపాడేందుకు ఇదే సరైన సమయమని రాయబార కార్యాలయం అభిప్రాయపడింది.
గాజాలో వైద్య సేవల సంక్షోభం
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాల ప్రకారం.. గాజాలోని 36 ఆసుపత్రులలో కేవలం 19 మాత్రమే ప్రస్తుతం అత్యంత పరిమిత వనరులతో పాక్షికంగా సేవలందిస్తున్నాయి. అత్యవసర శస్త్రచికిత్సలకు అవసరమైన మత్తుమందులు, యాంటీబయాటిక్స్, డయాలసిస్ కిట్లు, రక్తం, కనీసం ఆసుపత్రులలో జనరేటర్లు నడపడానికి కావాల్సిన ఇంధనం కూడా అక్కడ లభించడం లేదు. శిథిలాల కింద వేలాది మృతదేహాలు పేరుకుపోవడం, కలుషిత తాగునీరు, పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం వల్ల ప్రమాదకరమైన అంటువ్యాధులు, చర్మవ్యాధులు శరవేగంగా వ్యాపిస్తూ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
మరోవైపు.. నిధుల కొరత వల్ల వెస్ట్ బ్యాంక్ పరిధిలోనూ వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. అక్కడ పాలస్తీనా ఆరోగ్య శాఖ సేకరించాల్సిన 520 రకాల అత్యవసర మందులలో 180 రకాల మందులు అసలు అందుబాటులో లేవు. కేన్సర్ రోగులకు అవసరమైన 50 శాతం మందుల నిల్వలు పూర్తిగా జీరో శాతానికి చేరాయి. మందులు, వైద్య పరికరాల కొరత వల్లే వెస్ట్ బ్యాంక్ లో జరగాల్సిన దాదాపు 11 వేల శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి.

ఈ విపత్కర పరిస్థితులు పాలస్తీనా ప్రజలను నెమ్మదిగా మరణానికి దగ్గర చేస్తున్నాయని, మానవతా దృక్పథంతో తక్షణ సాయం అందించాలని కోరింది. సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన అత్యవసర ప్రాణ రక్షణ మందులను, వైద్య నిల్వలను త్వరితగతిన సరఫరా చేయాలని అంతర్జాతీయ సమాజంతో పాటు భారత ప్రభుత్వం, వైద్య సంస్థలు, స్వచ్ఛంద సామాజిక సంస్థలను భారత్ లోని పాలస్తీనా రాయబార కార్యాలయం అభ్యర్థించింది.












Click it and Unblock the Notifications