యూకే వెళ్లే భారత విద్యార్థులకు గుడ్ న్యూస్..!!
PM Modi met UK PM Keir Starmer: బ్రెజిల్‌లోని రియో డి జనేరియోలో ఏర్పాటైన జీ20 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి బిజీగా గడుపుతున్నారు. ఈ సమ్మిట్ సైడ్ లైన్స్‌లో భాగంగా బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్‌తో సమావేశమయ్యారు.
ప్రత్యేకించి- కీర్ స్టార్మర్‌తో మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి. బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత స్టార్మర్‌తో తొలిసారిగా మోదీ ముఖాముఖి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. వరుసగా మూడవసారి ప్రధానిగా ఎన్నికైనందుకు స్టార్మర్ కూడా మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ ముఖాముఖి భేటీ సందర్భంగా వారిద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. రెండు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా కొనజాగుతూ వస్తోన్న ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. దౌత్యసంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై మాట్లాడారు. ఈ విషయంలో ఉన్న పురోగతిపై సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, విద్యారంగం, అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణలు, గ్రీన్ ఫైనాన్స్.. వంటి అంశాలపై తాము దృష్టి సారించామని, ఆయా రంగాల్లో అగ్రగామిగా ఎదుుతున్నామని ఈ సందర్భంగా మోదీ ఆయనకు వివరించారు.
భారత్- బ్రిటన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తాము చిత్తశుద్ధితో ఉన్నామని మోదీ పునరుద్ఘాటించారు. ఆసియా- పసిఫిక్ రీజియన్ ఎదుర్కొంటోన్న సమస్యలను పరిష్కరించడానికి అంతర్జాతీయ సహకారాన్ని తీసుకుంటోన్నామని పేర్కొన్నారు.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల విషయంలో ద్వైపాక్షిక చర్చలను పునః ప్రారంభించాల్సిన అవసరం ఉందని మోదీ- స్టార్మర్ అభిప్రాయపడ్డారు. పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడంపై దృష్టి సారించాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
బ్రిటన్‌లో నివసిస్తోన్న భారతీయులు, విద్యార్థుల కోసం మరింత మెరుగైన కాన్సులర్ అవసరాలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మోదీ చెప్పారు. ఈ క్రమంలో రెండు కొత్త కాన్సులేట్‌లను ఏర్పాటు చేస్తోన్నట్లు ప్రకటించారు. బెల్‌ఫాస్ట్, మాంచెస్టర్‌లల్లో కొత్తగా ఈ రెండు కాన్సులేట్లు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
ఈ ప్రకటనను కీర్ స్టార్మర్ స్వాగతించారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు, పరిపాలన పరమైన సహాయ సహకారాలను అందిస్తామని చెప్పారు. భారతీయ విద్యార్థుల కోసం మరిన్ని వసతులను కల్పిస్తామని, దీనికి అవసరమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలను మరింత సరళీకరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications