వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్రెంచ్ చర్చిలో 2,16,000 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఫ్రెంచ్ కేథలిక్ చర్చి

ఫ్రెంచ్ క్యాథలిక్ చర్చిలో 1950 నుంచి దాదాపు 2.16 లక్షల మంది పిల్లలు మతాధికారుల చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యారని, బాధితుల్లో ఎక్కువ మంది అబ్బాయిలు ఉన్నారని తాజా విచారణలో తేలింది.

కనీసం 2,900 నుంచి 3,200 మంది ఈ వేధింపులకు పాల్పడ్డారని.. "బాధితుల పట్ల చర్చి క్రూరమైన ఉదాసీనత" చూపుతోందని విచారణ అధిపతి పేర్కొన్నారు.

విచారణలోని అంశాలు తెలిసినప్పటి నుంచి పోప్ ఫ్రాన్సిస్ చాలా బాధపడుతున్నారని వాటికన్ ఓ ప్రకటనలో పేర్కొంది.

చర్చి తన చర్యలను సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చిందని, వేధింపులకు గురి అయిన వ్యక్తులలో ఒకరు పేర్కొన్నారు.

బాధితుల సంఘం లా పరోల్ లిబరే(స్వేచ్ఛాయుత ప్రసంగం) వ్యవస్థాపకుడు ఫ్రాంకోయిస్ డెవాక్స్ మాట్లాడుతూ ఇది "నమ్మకానికి, నైతిక స్థితికి, పిల్లలకు జరిగిన ద్రోహం" అని తెలిపారు.

కేథలిక్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, చర్చిలోని సాధారణ సభ్యులు చేసిన అకృత్యాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే, ఫ్రాన్స్‌లో వేధింపులకు గురైన పిల్లల సంఖ్య 3.3 లక్షలకు పెరగవచ్చని విచారణలో తేలింది.

"ఎట్టకేలకు బాధితులను గుర్తించారు. అయితే, బాధితులకు న్యాయం జరిగే దిశగా చర్యలు తీసుకోవడానికి బిషప్‌లు, పోప్ ఇంకా సిద్ధంగా లేరు" అని డెవాక్స్ తెలిపారు. ఫ్రాన్స్ చరిత్రలో ఇదొక మలుపు అన్నారు.

వాటికన్ ప్రకటన ప్రకారం, ఇటీవల ఫ్రెంచ్ బిషప్‌లను కలుసుకున్న తర్వాత పోప్ ఈ నివేదిక గురించి తెలుసుకున్నారు.

"బాధితుల గురించి ఆయన చాలా బాధపడ్డారు. వారికి జరిగిన గాయాల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ముందుకు వచ్చి జరిగిన విషయాన్ని వెల్లడించిన వారి ధైర్యానికి కృతజ్ఞతలు చెప్పారు" అని సదరు ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా క్యాథలిక్ చర్చి అధికారులపై అనేక వేధింపు ఆరోపణల నేపథ్యంలో విచారణలు జరిగిన తర్వాత ఈ నివేదిక విడుదల అయింది.

ఈ ఘటనలపై స్వతంత్ర విచారణకు ఫ్రెంచ్ క్యాథలిక్ చర్చి 2018లో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా రెండున్నర సంవత్సరాలకు పైగా కోర్టు, పోలీసులు, చర్చి రికార్డులను కమిషన్ విశ్లేషించింది. బాధితులు, సాక్షులతో మాట్లాడింది.

విచారణ ద్వారా అంచనా వేసిన చాలా కేసులు ఫ్రెంచ్ చట్టాల ప్రకారం విచారణ చేపట్టడానికి చాలా పాతవిగా భావిస్తున్నారు.

పోప్

'బాధితులను నమ్మలేదు'

దాదాపు 2,500 పేజీల నిడివి ఉన్న ఈ నివేదికలో, బాధితుల్లో "అత్యధికులు" అబ్బాయిలేనని, వారిలో చాలామంది 10 నుంచి 13 ఏళ్ల మధ్య వయసు వారని పేర్కొంది.

వేధింపులను నివారించడంలో చర్చి విఫలమవడమే కాకుండా, దానిని నివేదించడంలో కూడా విఫలమైందని, నాడు తెలిసి కూడా పిల్లలను వేటాడే క్రూర జంతువులతో సన్నిహితంగా ఉంచిందని చెప్పింది.

"అంతటా నిర్లక్ష్యం, లోపాలు, మౌనం, సంస్థాగతంగా కప్పిపుచ్చుకోవడం" ఈ ఘటనల్లో ఉన్నాయని విచారణ అధిపతి జీన్-మార్క్ సావే మంగళవారం విలేకరులతో అన్నారు.

2000 సంవత్సర ప్రారంభం వరకు, బాధితుల పట్ల చర్చి "లోతైన, క్రూరమైన ఉదాసీనతను" చూపించిందని ఆయన చెప్పారు.

"బాధితుల కథనం వినరు, నమ్మరు" అని జీన్-మార్క్ సావే వివరించారు.

కేథలిక్ చర్చిలో లైంగిక వేధింపులు ఒక సమస్యగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

మొత్తం 1,15,000 మంది ప్రీస్ట్‌లు, మతాధికారుల్లో 3,200 మందికి వ్యతిరేకంగా కమిషన్ సాక్ష్యాలను సేకరించింది. అయితే, 3200 మంది కంటే ఎక్కువమందే వేధింపులకు పాల్పడి ఉండొచ్చని వివరించింది.

"కుటుంబం, స్నేహితుల సర్కిల్‌ తర్వాత లైంగిక హింస అత్యధికంగా ఉన్న వాతావరణం క్యాథలిక్ చర్చి" అని నివేదిక పేర్కొంది.

పార్లర్ ఎట్ రివివ్రే బాధితుల అసోసియేషన్ అధిపతి ఒలివియర్ సావిగ్నాక్ 13 సంవత్సరాల వయస్సులో దక్షిణ ఫ్రాన్స్‌లోని క్యాథలిక్ హాలిడే క్యాంప్ డైరెక్టర్ చేతిలో వేధింపులకు గురయ్యారు.

ఆయన అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, వేధింపులకు ముందు, ఆ ప్రీస్ట్‌ "మంచివాడు, హాని చేయకుండా, నాపై శ్రద్ధ తీసుకునే వ్యక్తి"గా భావించానని చెప్పారు.

"చిన్నతనంలో లైంగిక దాడి అనేది బాధితుడి శరీరం, బాధితుడి మనసు లోపల కుళ్లిన పుండులా ఉంటుంది. ఇది పెరుగుతున్న కణతి లాంటిది" అని ఆయన అన్నారు.

వేధింపులకు గురైన దాదాపు 60 శాతం మంది పురుషులు, మహిళలు "వారి భావోద్వేగ లేదా లైంగిక జీవితంలో ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటున్నారు" అని విచారణలో తేలింది.

ఫ్రాంకోయిస్ డెవాక్స్

ఇప్పటికైనా మేలుకోవాలి...

''70 సంవత్సరాలకు పైగా ఈ వేధింపులు కొనసాగాయి. సగానికి పైగా కేసులు 1970కి ముందువే. అయినప్పటికీ చాలా మంది ఫ్రెంచ్ వారు.. చర్చి లైంగిక వేధింపుల ఘటనలపై పూర్తిగా మేల్కొనే క్షణం ఇది''అని బీబీసీ పారిస్‌ కరస్పాండెంట్‌, హుగ్‌ స్కోఫీల్డ్‌ విశ్లేషించారు.

''నివేదిక ప్రకారం, పశ్చాత్తాపం, మతపరమైన మార్పులు సరిపోవు. యువతపై చాలాకాలంగా మతాధికారులు లైంగిక వేధింపులు జరిపారని గుర్తించాలి. దీనికి చర్చి బాధ్యత వహించాలి.

చర్చిలోని చాలా మంది తాజా విషయాలు విని భయపడతారు.

రిలీజియస్‌ ఆర్డర్స్‌ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ సిస్టర్ వెరోనిక్ మార్గ్రాన్ చెప్పినట్లుగా 'చర్చి వణుకుతుంటే, దాన్ని అలాగే వణకనివ్వండి' అని హుగ్‌ స్కోఫీల్డ్‌ పేర్కొన్నారు.''

జీన్-మార్క్ సావే

పరిహారం ఇవ్వాలని ఆదేశం

విచారణ పరిధిలోకి వచ్చిన కొన్ని కేసులు మాత్రమే క్రిమినల్ ప్రాసిక్యూషన్‌లను దాటుకుని క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా చేశాయి.

అయితే చాలా వరకు కేసులు మరీ పాతవి కావడంతో ఇప్పటి కోర్టుల ద్వారా ప్రాసిక్యూట్ చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో బాధితులకు నష్టపరిహారం అందించడంతో సహా, జరిగిన దానికి బాధ్యత వహించాలని చర్చిని విచారణ కమిషన్‌ ఆదేశించింది.

ఆర్థిక నష్టపరిహారం బాధితులు ఎదుర్కొన్న గాయాలను మాన్పించలేకపోయినప్పటికీ "వారిపై జరిగిన వేధింపులను గుర్తించేందుకు ఇది ఎంతో అవసరం" అని పేర్కొంది.

ప్రీస్ట్‌లకు, ఇతర మతాధికారులకు శిక్షణ ఇవ్వడం, బాధితులను గుర్తించే విధానాలను ప్రోత్సహించడం తదితర సిఫార్సులను విచారణ కమిషన్ చేసింది.

"మేం చర్చి ద్వారా స్పష్టమైన, కచ్చితమైన ప్రతిస్పందనలను ఆశిస్తున్నాం," అని బాధితుల సంఘం తెలిపింది.

బాధితుల సంఖ్య, వారి అనుభవాలు "మనం ఊహించలేనంతగా ఉన్నాయి" అని ఫ్రాన్స్ బిషప్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ అన్నారు.

వచ్చే ఏడాది నుంచి బాధితులకు "ఆర్థిక సహకారం" అందించే ఓ ప్రణాళికను ఫ్రెంచ్ చర్చి గతంలో ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Sexual abuse of 2,16,000 children in a French church
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X