నో పవర్, నో ఇంటర్నెట్: బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన శ్రీలంక
Sri Lanka power cuts: శ్రీలంక ఆర్థిక సంక్షోభం కట్టుతప్పింది. ధరల పెరుగుదలో ఇప్పటికే అల్లకల్లోలానికి గురవుతున్న ఆ దేశంలో తాజాగా కొత్త సమస్య తలెత్తింది. విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థ కుప్పకూలింది. ఒక్కసారిగా అంధకారం అలముకుంది.
దీనితో బ్లాక్ అవుట్‌ను ప్రకటించింది శ్రీలంక ప్రభుత్వం. విద్యుత్ సరఫరా వ్యవస్థను పునరుద్ధరించడానికి తక్షణ చర్యలు చేపట్టినట్టు ప్రకటించింది. కరెంటు సరఫరా స్తంభించిపోవడం వల్ల ఇంటర్నెట్ అందుబాటులో ఉండట్లేదు. ఫలితంగా దీని మీద ఆధారపడిన రంగాలన్నీ అతలాకుతలానికి గురయ్యాయి. పరిశ్రమల కార్యకలాపాలు నిలిచిపోయాయి.

దేశవ్యాప్తంగా అంధకారం నెలకొనడానికి ప్రధాన కారణాలను అన్వేషిస్తోంది శ్రీలంక ప్రభుత్వం. కొట్మలె-బియగామా ట్రాన్స్‌మీషన్ లైన్‌లో తలెత్తిన బ్రేక్ డౌన్ దీనికి కారణమని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ తెలిపింది. దీనితో పాటు ఇతర పవర్ గ్రిడ్‌లల్లో బ్లాక్ అవుట్ సంభవించినట్లు అంచనా వేసింది.

యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలను చేపట్టినట్లు సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అధికార ప్రతినిధి నోయెల ప్రియాంత తెలిపారు. పలు నగరాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని, కొలంబోలోని కొన్ని ప్రాంతాలకు కరెంట్ అందుతోందని అన్నారు. ఆసుపత్రులు, ప్రజా రవాణాకు ప్రాధాన్యతను ఇచ్చామని పేర్కొన్నారు.

సుదీర్ఘకాలంగా శ్రీలంక పెను ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ వస్తోన్న విషయం తెలిసిందే. పెట్రోల్ సహా ఇతర నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి అక్కడ. ప్రభుత్వం సైతం మారిపోయిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న దశలో పవర్ బ్లాక్ అవుట్ సంభవించింది.












Click it and Unblock the Notifications