రాత్రికి రాత్రే కొట్టుకుపోయిన 62 డ్యామ్‌లు.. 50 ఏళ్ల క్రితం చరిత్రలోనే అత్యంత చీకటి రోజు..
ప్రకృతి కన్నా మనిషి అహంకారం పెద్దది కాదని నిరూపించిన ఘటనలు చరిత్రలో చాలానే ఉన్నాయి. కానీ, ఒకే ఒక్క రాత్రిలో డజన్ల కొద్దీ డ్యామ్‌లు బద్దలై , దాదాపు రెండు లక్షల మంది ప్రాణాలు జలసమాధైన.. ఆ నిజాన్ని ఓ దేశ ప్రభుత్వం పాతికేళ్ల పాటు ప్రపంచానికి తెలియకుండా దాచిపెడితే? చైనా చరిత్రలోనే అతిపెద్ద మానవ నిర్మిత విపత్తుగా మిగిలిపోయిన 'బాన్‌కియావో డ్యామ్' విధ్వంసం వెనుక ఉన్న భయంకరమైన కథ ఇది. 1975లో జరిగిన ఈ మహా విషాదం, ఇటీవల నేపాల్, భారత్ సరిహద్దుల్లో చైనా నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టుల నేపథ్యంలో మరోసారి వార్తల్లోకి వచ్చింది.
అది 1950ల కాలం. అప్పుడే ఆవిర్భవించిన చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం, మావో జెడాంగ్ నాయకత్వంలో "నదులను బంధించి ప్రకృతిపై విజయం సాధిస్తాం" అంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగమే హెనాన్ ప్రావిన్స్‌లోని రు నదిపై నిర్మించిన 'బాన్‌కియావో' డ్యామ్. సోవియట్ ఇంజనీర్ల సాయంతో దీనిని పునర్నిర్మించి, "దీనికి ఎప్పటికీ విచ్ఛిత్తి ఉండదు.. ఇది ఐరన్ డ్యామ్" అని గొప్పలు చెప్పుకున్నారు. డ్యామ్ సైజు పెంచడంపై ఉన్న శ్రద్ధ, నీటి విడుదల వ్యవస్థపై చూపలేదు. సరిగ్గా ఇదే సమయంలో 'నీటిని నిల్వ చేయడం మాత్రమే ముఖ్యం' అని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను వ్యతిరేకించిన ఇంజనీర్లను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఆ తప్పుడు డిజైన్లే వేలాది గ్రామాల గొంతు నులిమాయి.

ఆకాశానికి చిల్లు పడింది.. ఒక్క రాత్రిలోనే విలయం!
1975 ఆగస్టు మొదటి వారంలో 'నినా' అనే తీవ్రమైన తుఫాను హెనాన్ ప్రావిన్స్‌ను ముంచెత్తింది. ఏడాది మొత్తం పడాల్సిన వర్షం కేవలం మూడు రోజుల్లోనే కురిసింది. ఆగస్టు 7 నాటికి డ్యామ్‌లోకి నిమిషానికి వేల క్యూబిక్ మీటర్ల నీరు వచ్చి చేరుతోంది. కానీ నీటిని కిందకు విడుదల చేసే గేట్లు సరిపోలేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత, ఒక్కసారిగా ఆకాశం పగిలి భూమి రెండుగా విడిపోయినంత భయంకరమైన శబ్దం వచ్చింది. "ఐరన్ డ్యామ్"గా పిలుచుకున్న బాన్‌కియావో గోడలు నీటి ఒత్తిడికి తట్టుకోలేక కొట్టుకుపోయాయి. పది కిలోమీటర్ల వెడల్పు, 20 అడుగుల ఎత్తున విరుచుకుపడిన నీటి ప్రవాహం.. కనురెప్ప మూసి తెరిచేలోపే వందలాది గ్రామాలను మ్యాప్ నుంచి తుడిచిపెట్టేసింది.
ఒకదాని వెనుక ఒకటి 62 డ్యామ్‌ల ధ్వంసం
బాన్‌కియావో డ్యామ్ తెగిపోవడంతో ప్రవాహ ఉధృతికి దారిలో ఉన్న షిమంటాన్ డ్యామ్‌తో పాటు చిన్నవి, పెద్దవి కలిపి మొత్తం 62 డ్యామ్‌లు వరుసగా పేకమేడల్లా కూలిపోయాయి. గాఢ నిద్రలో ఉన్న పల్లెలు, పట్టణాలు వరద ప్రవాహంలో గాల్లో కొట్టుకుపోయాయి. కనీసం ప్రజలను అప్రమత్తం చేసేందుకు వైర్‌లెస్ లేదా టెలిఫోన్ సౌకర్యాలు కూడా ఆ సమయంలో పనిచేయలేదు. చాలా గ్రామాల్లో నీరు వచ్చినట్లు తెలిసేలోపే ప్రాణాలు పోయాయి. సుమారు 26,000 మంది క్షణాల్లో నీటిలో మునిగి చనిపోగా.. తర్వాతి రోజుల్లో సహాయం అందక, డయేరియా, కలరా వంటి అంటువ్యాధులు, ఆకలి చావుల వల్ల చనిపోయిన వారి సంఖ్య లక్ష దాటింది. మొత్తం మీద 2.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆ తర్వాతి కాలంలో లెక్క తేల్చాయి.
పాతికేళ్ల పాటు ప్రపంచాన్ని బురిడీ కొట్టించిన బీజింగ్
ఇంతటి ఘోరం జరిగితే చైనా ప్రభుత్వం ఏం చేసింది? అప్పటికే పీక్‌లో ఉన్న 'సాంస్కృతిక విప్లవం' ఇమేజ్ దెబ్బతింటుందనే భయంతో వార్తను నొక్కిపెట్టింది. చైనా అధికారిక మీడియాలో అసలు డ్యామ్‌లు కూలిన వార్తే రాలేదు. సాయం కోసం ప్రపంచ దేశాలను కోరలేదు. ప్రభుత్వం నేరుగా ఎలాంటి రహస్య ఉత్తర్వులు ఇవ్వకుండానే "మంచి వార్తలు మాత్రమే రాయాలి, చెడు వార్తలు దాచాలి" అనే కమ్యూనిజం సూత్రాన్ని అమలు చేసింది. దాదాపు 20 ఏళ్ల పాటు ఈ దారుణాన్ని తొక్కిపెట్టగా.. 1995లో 'హ్యూమన్ రైట్స్ వాచ్' నివేదికతో చైనా అసలు రంగు బయటపడింది. ఆ తర్వాత సైంటిస్టులు, విదేశీ యూనివర్సిటీలు దీనిపై పరిశోధనలు చేసి నిజాలను వెలికితీశాయి.
హిమాలయాల్లో మళ్లీ అదే ప్రమాద ఘంటికలు!
ఈ 50 ఏళ్ల నాటి 'బాన్‌కియావో' విషాదం ఇప్పుడు భారత్, నేపాల్ దేశాలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇటీవల నేపాల్‌లోని భోటె కోశి-త్రిశూలి నదీ ప్రాంతంలో సంభవించిన అకస్మాత్తు వరదలకు చైనా సరిహద్దుల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులే కారణమని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో, భారత్ సరిహద్దుకు అతి సమీపంలో మెడోగ్ వద్ద అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా ఏకంగా 60,000 మెగావాట్ల భారీ డ్యామ్‌ను నిర్మిస్తోంది.
భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రమాదకర ప్రాంతంలో చైనా కడుతున్న ఈ భారీ ప్రాజెక్టులు రేపు బాన్‌కియావో తరహా విపత్తుకు దారితీస్తే, దిగువన ఉన్న భారత్, నేపాల్ వంటి దేశాలకు సమాచారం కూడా ఇవ్వకుండా చైనా దాచేస్తుందా అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. సమాచారాన్ని దాచడం ప్రకృతి వైపరీత్యం కంటే ప్రమాదకరమని ఈ చరిత్ర చెబుతోంది.













Click it and Unblock the Notifications