మన వానల్ని లాగేసుకున్న చైనా.. డ్రాగన్ కంట్రీని వణికిస్తోన్న ‘బావి’ టైఫూన్!
ప్రకృతి విలయతాండవానికి చైనా వణికిపోతోంది. పసిఫిక్ మహాసముద్రంలో పుట్టి, ఫ్రాన్స్ దేశమంత భారీ వైశాల్యంతో విస్తరించిన 'బావి' టైఫూన్ చైనాలో తీవ్ర బీభత్సం సృష్టిస్తోంది. తీరం దాటినప్పటికీ ఈ తుఫాను ప్రభావం తగ్గకపోగా, ఈశాన్య ప్రావిన్సులపై దీని ప్రతాపం కొనసాగుతోంది. ముఖ్యంగా లియావోనింగ్, జిలిన్ ప్రాంతాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 2.6 లక్షల మందికి పైగా జనాన్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ తుఫాను సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. లియావోనింగ్ రాజధాని షెన్యాంగ్‌లో వరద తీవ్రతకు ఒక లైట్‌హౌస్ వద్ద ఉన్న భారీ హైటెన్షన్ కరెంట్ లైన్ తెగిపోయింది. అది వరద నీటిపై తేలుతూ, బ్రిడ్జీల కిందుగా కొట్టుకుపోతున్న భయంకరమైన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో నగరాల్లోని స్కూళ్లు, కోచింగ్ సెంటర్లకు అధికారులు సెలవులు ప్రకటించగా, రవాణా సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ఎక్కువ కాలం.. 13 రోజులు మనుగడ సాగించిన ఉష్ణమండల తుఫాన్‌గా ఇది రికార్డు సృష్టించింది.

ఉత్తర చైనా వైపు భారీ తేమ ప్రవాహం
ఈ తుఫాను కేంద్రభాగం (వార్మ్ కోర్) చాలా బలంగా ఉండటం వల్ల సముద్రం నుంచి సేకరించిన భారీ తేమను ఇది ఉత్తర చైనా, కొరియా ద్వీపకల్పం వైపు మోసుకెళ్తోంది. పర్వత ప్రాంతాలు, వెచ్చని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఈ తుఫానుకు నిరంతరం శక్తిని అందిస్తుండటంతో గాలి వేగం తగ్గినా కొండపోత వర్షాలు మాత్రం కురుస్తూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 300 నుండి 450 మిల్లీమీటర్ల మేర రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
భారత రుతుపవనాలపై 'బావి' దెబ్బ..
ఈ 'బావి' తుఫాను ప్రభావం భారతదేశంపై కూడా తీవ్రంగా పడింది. భారత్‌కు వర్షాలు తీసుకురావాల్సిన నైరుతి రుతుపవనాల గాలులను ఈ శక్తివంతమైన తుఫాను తనవైపునకు లాగేసుకుంది. దీనికి తోడు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన బలమైన ఎల్‌నినో ప్రభావం కూడా తోడవడంతో బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనాలు ఏర్పడకుండా ఆటంకం కలిగింది. ఫలితంగా భారత ఉపఖండంలో గత కొన్ని రోజులుగా వర్షాలు తగ్గిపోయి, తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి.
త్వరలోనే భారత్‌కు ఊరట..
అయితే, భారత్‌కు ఒక సానుకూల వార్త అందుతోంది. ఈనెల 6వ తేదీన 'బావి' తుఫాను చైనాలో తీరం దాటి క్రమంగా బలహీనపడింది. దీనివల్ల రుతుపవన గాలులు మళ్లీ భారతదేశం వైపు మళ్లడానికి మార్గం సుగమమైందని ప్రైవేట్ వాతావరణ సంస్థ 'స్కైమెట్' అంచనా వేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో నేటి నుంచి వాయవ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడి, ఆ తర్వాత 16 లేదా 17వ తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో ఒక బలమైన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. దీనితో దేశంలో మళ్లీ వర్షాలు పుంజుకునే అవకాశం ఉంది.
Cars swept away like toys, floods wreak havoc in China
— Siraj Noorani (@sirajnoorani) July 14, 2026
Floods following heavy rains in eastern China have severely disrupted life. Many cars were seen floating like toys in the strong currents. The floodwaters have caused extensive damage to roads and residential areas.… pic.twitter.com/W7xTaGFFvr















Click it and Unblock the Notifications