ప్రతి గంటకు ఒక మహిళ ఖతం.. ఇప్పటికే 28 వేల మంది.. ఏం జరుగుతోంది..?
అక్కడ ప్రతి గంటకు ఓ మహిళ మృతి చెందుతోంది. ఇప్పటికే 28 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కేవలం 48 గంటల్లోనే దాదాపు 14వేల మంది చిన్నారులు ఆకలితో మృతి చెందారు. ఈ దారుణమైన సంఘటనలు గాజా ప్రాతంలో చోటుచేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో గాజా ప్రాంతంలోని ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు అధికంగా మృత్యువాత పడుతున్నారు.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన 2023 అక్టోబరు నుంచి ఇప్పటివరకూ దాదాపు 28 వేల మందికి పైగా మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు యూఎన్ విమెన్ అనే సంస్థ ప్రచురించింది. ఇజ్రాయెల్ జరుపుతున్న ఎటాక్స్ లో భాగంగా గాజాలో సగటున ప్రతి గంటకు ఓ మహిళ లేదా చిన్నారి మృతి చెందుతున్నట్లు వెల్లడైంది. ఇప్పటికే వేల మంది తల్లులు మృతి చెందడం కారణంగా చిన్నారులు, కుటుంబాలు అస్తవ్యస్తం అయినట్లు తేలింది.
2025 మార్చిలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విఫలం అయింది. దీంతో గాజా ప్రాంతానికి సహాయం నిలిచిపోయింది. ఇప్పటికే లక్షల మంది అమ్మాయిలు, మహిళలు ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్య సమితి ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేసింది. కరువు, వ్యాధుల కారణంగా గాజాలోని ప్రజలకు సరిపడా ఆహార నిల్వలు లేవని తెలిపింది.

యుద్ధం, వలసలు, ప్రాథమిక భద్రతా లోపం కారణంగా గాజాలో మాతా శిశు మరణాలు పెరిగాయి. గాజాలోని ప్రజలను ఆదుకునేందుకు కొన్ని ఎన్జీఓ సంస్థలు ముందుకొచ్చినా.. నిధుల కొరత, మౌలిక వసతుల లేమితో ఇబ్బందులు తలెత్తుతున్నాయని యూఎన్ విమెన్ సంస్థ పేర్కొంది. అధికారిక లెక్కల ప్రకారం 28 వేల మందికిపైగా మహిళలు, చిన్నారులు మృతి చెందుతున్నట్లు తెలిపింది. అనధికారికంగా ఇంకా అధిక సంఖ్యలో నష్టం వాటిల్లినట్లు స్పష్టం చేసింది.
గాజాలో మానవతా సహాయం నిలిపివేయడం కారణంగా అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా మారిందని యూఎన్ విమెన్ సంస్థ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న దాదాపు 70వేల మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో ఉన్నారని తెలిపారు. వీరిలో 14 వేల మందికి పైగా చిన్నారులు తీవ్రస్థాయి పౌష్టికాహార లోపంతో ఉన్నట్లు వివరించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇటీవల మాట్లాడుతూ.. గాజాకు కరవు రాకుండా తక్కువ ఆహార నిల్వల సరఫరాకు అనుమతి ఇస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications