Syria: సిరియాలో మళ్లీ మారణహోమం.. ఈ రక్తపాతం ఎందుకు జరుగుతోంది?
Syria: సిరియాలో గత మూడు రోజులుగా మారణహోమం కొనసాగుతోంది. గత మూడు రోజులుగా జరుగుతున్నఈ హింసాకాండలో వెయ్యిమందికి పైగా మరణించారు. దేశాన్ని స్వాధీనం చేసుకున్న కొత్త ప్రభుత్వానికి, మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ మద్ధతుదారులకు మధ్య ఈ వివాదం భయంకరంగా మారింది. సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్న సంస్థలు.. సిరియా భద్రతా దళాలకు, మాజీ అధ్యక్షుడు అసద్ మద్దతుదారులకు మధ్య గత 3 రోజులుగా జరుగుతున్న పోరాటంలో ఇప్పటివరకు 1000 మందికి పైగా మరణించారని వెల్లడించాయి. 14 సంవత్సరాల క్రితం సిరియన్ వివాదం ప్రారంభమైనటి నుంచి శనివారం అత్యంత ప్రాణాంతకమైన రోజుగా అభివర్ణిస్తున్నారు.
1000 మంది మృతి
ఈ హింసాకాండలో 745 మంది పౌరులు మరణించారని బ్రిటీష్ సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. వీరిలో ఎక్కవ మంది చాలా దగ్గరి నుంచి కాల్చి చంపారు. వీరితో పాటు ప్రభుత్వ భద్రతా దళాలకు చెందిన 125 మంది ప్రాణాలు కోల్పోయారు. మాజీ అధ్యక్షుడు అసద్ తో సంబంధం ఉన్న సాయుధ గ్రూపులకు చెందిన 148 మంది మరణించారు. లటాకియా నగరం చుట్టుపక్కల కీలక ప్రాంతాలకు విద్యుత్, తాగునీరు నిలిపివేయబడిందని నివేదికలు తెలిపాయి. 2024 డిసెంబర్ లోనే సిరియాలో అధికార మార్పు జరిగింది. అబూ మహమ్మద్ అల్-జులానీ నేతృత్వంలోని హెచ్‌టీఎస్(హయత్ తహ్రీర్ అల్ షామ్) సంస్థ రాజధాని డమాస్కస్ ను స్వాధీనం చేసుకున్నప్పుడు బషర్ అల్-అసద్ దేశం విడిచి పారిపోవలసి వచ్చింది.

సిరియాలో పౌరుల ఊచకోత
అబూ మహమ్మద్ అల్-జులానీ అప్పుడు తనను తాను దేశ కొత్త అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. కానీ 2 నెలలకు పైగా శాంతి తర్వాత వివాదం మరోసారి చెలరేగింది. సిరియా కొత్త ప్రభుత్వం అసద్ మద్దతుదారుల దాడులకు ప్రతిస్పందిస్తున్నట్లు తెలిపింది. ఈ భయంకరమైన హింసకు వ్యక్తిగత చర్యలే కారణమని ప్రభుత్వం ఆరోపించింది. దేశంలో ప్రస్తుతం మాజీ అధ్యక్షుడు అసద్ కు బలమైన ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతంలో హింస చెలరేగింది. నివేదిక ప్రకారం.. సున్నీ ముస్లిం ముష్కరులు అసద్ ప్రాంతంలో అలవైట్ మైనారిటీలపై నిరంతరం దాడులు చేస్తూనే ఉన్నారు. అలవైట్ మైనారిటీ షియా ముస్లింలలో ఒక శాఖ. బషర్ అల్-అసద్ కూడా అలవైట్ కమ్యూనిటీ నుంచి వచ్చాడు.
షియా వర్సెస్ సున్నీ వివాదం కూడా కారణమే..
షియా వర్సెస్ సున్నీ వివాదం కూడా ప్రస్తుత వివాదానికి మూలకారణం. అలవైట్ సమాజం దశాబ్దాలుగా బషర్ అల్-అసద్ పాలనకు మద్దతు ఇస్తోంది. కానీ ఇప్పుడు అసద్ ప్రభుత్వం పడిపోయింది. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం.. అలవైట్ సమాజం ఆధిపత్యం చెలాయించే గ్రామాలు, పట్టణాలలో ప్రజలు ఊచకోత కోయబడ్డారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు లాగి కాల్చి చంపేశారు. వీధుల్లో నడుస్తున్న ప్రజలపై కాల్పులు జరిపారు. సిరియా తీరప్రాంతానికి చెందిన నివాసితులు మాట్లాడుతూ.. అలవైట్ ఇళ్లను దోచుకుంటున్నారని, వివిధ ప్రాంతాలలో వాళ్లకు నిప్పంటించారని చెప్పారు. ప్రజలు తమ ఇళ్లను వదిలి కొండ ప్రాంతాలవైపు కదులుతున్నారని స్థానిక నివాసితులు వెల్లడించారు.
Syria plunges into civil war as the new government opens fire on civilians' homes.#Syria pic.twitter.com/uePfHxtNKj
— Anam 🇦🇪 (@jaffery_anam) March 9, 2025
అలవైట్ల ఊచకోత
హింస వల్ల ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతం బనియాలు. వీధుల్లో మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఇళ్ల, భవనాలలో ప్రజల మృతదేహాలు ఎవరూ రాకుండా పడి ఉన్నాయని.. శవాలను పూడ్చడానికి కూడా ఎవరూ లేరని..మృతదేహాలను పూడ్చి పెట్టకుండా ముష్కరులు ప్రజలను అడ్డుకుంటున్నారని ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాకు తెలిపారు. సాక్షుల ప్రకారం.. శుక్రవారం నాడు ఐదుగురు మృతదేహాలను పూడ్చిపెట్టకుండా ముష్కరులు ప్రజలను చాలా గంటల పాటు అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా.. అసద్ పరిపాలనలో జరిగిన దారుణాలకు అలవైట్ సమాజంపై ప్రతీకారం తీర్చుకోవడం ద్వారా మూల్యం చెల్లించుకుంటున్నారని ముష్కరులు అంటున్నారు. వీధుల్లో నుంచి ప్రజల ఇళ్లపై ముష్కరులు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతున్నారు. సిరియాలో జరుగుతున్న హత్యలపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. ఈ హింసాకాండపై ఫ్రాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఫ్రెంచ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సిరియా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఈ రక్తపాతం స్వతంత్ర దర్యాప్తు జరిగేలా చూడాలని కోరింది.












Click it and Unblock the Notifications