ట్రంప్ టారిఫ్ బాంబ్.. భారత్ పై 500 శాతం సుంకాలు..?
భారత్- అమెరికా మధ్య మరోసారి టారిఫ్ వార్ ప్రారంభం కానుందా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్రతరం అవుతున్నాయి. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం మరోసారి వేడెక్కింది. హార్మూజ్ జలసంధిపై ఆంక్షల నేపథ్యంలో భారత్ ప్రస్తుతం ఆర్థికంగా కొంత సతమతం అవుతుంది. అయితే ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ మరో బిగ్ సవాల్ ను ఎదుర్కోబోతున్నట్లు స్పష్టం అవుతోంది. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగి ఆ ప్రభావం ప్రపంచదేశాలతోపాటు భారత్ పైనా పడింది. అయితే తాజాగా ఇప్పుడు అమెరికా.. భారత్ పై ఏకంగా 500 శాతం సుంకాలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో భారత్ తో పాటు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై అమెరికా తన ప్రతాపం చూపించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత్ పై ఏకంగా 500 శాతం టారిఫ్ లు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన నలుగురు సెనేటర్లు.. ట్రంప్ ప్రభుత్వంతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలే లక్ష్యంగా ఈ టారిఫ్ లు ఉండనున్నాయి.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై టారిఫ్ లు విధించి తద్వారా రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా భావిస్తోంది. తాజాగా ఈ ఒప్పందాన్ని రిపబ్లికన్ సెనేటర్లు లిండ్ సే గ్రహమ్, రోగర్ వికర్లతో పాటు డెమోక్రటిక్ సెనేటర్లు రిచార్డ్ బ్లూ మెంతాల్, జెన్నే షాహీన్ లు ప్రకటించారు. తాము ట్రంప్ ప్రభుత్వంతో క్షుణ్ణంగా చర్చలు జరిపి ఈ బిల్లును చట్టం చేసేందుకు అంగీకరించామని అన్నారు. ఈ బిల్లును త్వరలోనే లెజిస్లేషన్ లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
మరోవైపు ఉక్రెయిన్ లోని సాధారణ ప్రజలపై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉందని దాంతో ఈ బిల్లును వేగవంతంగా చట్టంగా మార్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సెనేటర్లు అన్నారు. ఈ చట్టం ద్వారా రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై భారం మరింత పెరుగుతుందని తెలిపారు. దాంతో ఆ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకోవడాన్ని ఆయా దేశాలు నిలిపివేస్తాయని అన్నారు. చమురు వాణిజ్యం ద్వారా వచ్చిన మొత్తాన్ని రష్యా యుద్ధానికే వినియోగిస్తుందని తెలిపారు. ఈ రకంగా ఆ దేశాలు కూడా పరోక్షంగా రష్యా యుద్ధానికి సహకరించినట్లుగా భావించాలని పేర్కొన్నారు.

ఈ మేరకు నలుగురు సెనేటర్లు రష్యా యాక్ట్ ఆఫ్ 2025 ను సమర్థిస్తూ వస్తున్నారు. ఈ చట్టం ప్రకారం అమెరికాకు ఆయా దేశాల నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై గరిష్టంగా 500 శాతం వరకు దిగుమతి విధించే ప్రతిపాదన ఈ చట్టంలో పొందుపరిచారు. ఇక రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. దాంతో భారత్ వస్తువులపై 500 శాతం టారిఫ్ లు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తంగా ఈ ప్రతిపాదనకు అమెరికా సెనేట్ లో దాదాపు 84 మంది సభ్యులు మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో భారత్ వస్తువులపై అమెరికా సుంకాల మోత మోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications