షాక్: స్టూడెంట్ వీసాల్లో 60 శాతం కోత: భారత్ జోరుకు ట్రంప్ బ్రేకులు..
అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలనే భారతీయుల కలలపై 'ట్రంప్ 2.0' ప్రభావం గట్టిగా పడుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమలు చేస్తున్న కఠిన వలస విధానాల వల్ల గత ఏడాది కాలంలో వీసాల జారీ ప్రక్రియలో అసాధారణ కోత విధించబడింది. 2024 తొలి ఎనిమిది నెలలతో పోలిస్తే, 2025 అదే సమయంలో ఏకంగా 2.5 లక్షల వీసాలు తక్కువగా జారీ అయ్యాయని 'వాషింగ్టన్ పోస్ట్' తాజా కథనంలో వెల్లడించింది. ఈ పరిణామం వల్ల ప్రపంచవ్యాప్తంగా నష్టపోయిన దేశాల్లో భారత్, చైనాలే అగ్రస్థానంలో ఉన్నాయి.
అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ గణాంకాల ప్రకారం.. శాశ్వత మరియు తాత్కాలిక వీసాల ఆమోదంలో దాదాపు 11 శాతం తగ్గుదల నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మే-ఆగస్టు మధ్య భారతీయ విద్యార్థులకు జారీ చేసే ఎఫ్-1 (F-1) వీసాల్లో సుమారు 60 శాతం కోత పడటం గమనార్హం. కేవలం విద్యార్థులే కాకుండా, హెచ్-1బి (H-1B) వంటి ఉపాధి వీసాలు, సాంస్కృతిక మార్పిడి వీసాలు (J-1), మరియు అమెరికా పౌరుల కుటుంబ సభ్యులకు ఇచ్చే వీసాల పంపిణీ కూడా గణనీయంగా పడిపోయింది.

Trump 'అమెరికా ఫస్ట్'.. రాజీలేని పరిశీలన!
"అమెరికా పౌరుల భద్రత, ప్రయోజనాలే మాకు ప్రథమ ప్రాధాన్యం" అన్న ట్రంప్ నినాదమే ఈ మార్పులకు ప్రధాన కారణం. వైట్‌హౌస్ ప్రతినిధి అబిగెయిల్ జాక్సన్ ఈ విధానాలను సమర్థిస్తూ.. విదేశీయుల పరిశీలన (Vetting) విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ఖాతాల తనిఖీతో సహా అదనపు సెక్యూరిటీ చెక్స్‌ను ప్రవేశపెట్టడం, కొన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించడం వంటి చర్యల వల్ల వీసా జారీ ప్రక్రియ ఆలస్యమవడమే కాకుండా తిరస్కరణలు కూడా పెరుగుతున్నాయి.
ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపేనా?
వీసా కోతలపై అమెరికాలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వలసదారుల సంఖ్య తగ్గడం వల్ల అమెరికాలోని యూనివర్సిటీల ఆదాయం దెబ్బతినడమే కాకుండా, సాంకేతిక రంగంలో నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత ఏర్పడవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ, ట్రంప్ ప్రభుత్వం మాత్రం చట్టబద్ధమైన వలసలను కూడా నియంత్రించి, స్వదేశీయులకే ఉద్యోగ అవకాశాలు దక్కాలనే పట్టుదలతో ముందుకు సాగుతోంది.












Click it and Unblock the Notifications