పండగ పూటా పాత పాటే- మోదీకి ఫోన్ చేసి చెప్పాల్సింది చెప్పా..!!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక నివాసొం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ లో తన రిజాల్యూట్ డెస్క్ ముందు పూలతో అలంకరించిన దీపస్తంభంపై అమర్చిన అయిదు వత్తులతో వెలిగించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో భారత సంతతికి చెందిన వివిధ విభాగాల అధినేతలు పాల్గొన్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టింగేషన్ డైరెక్టర్ కాష్ పటేల్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బార్డ్ వంటి అధికారులు దీనికి హాజరయ్యారు.
ఈ దీపం చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి" సాధించిన విజయానికి ప్రతీకగా అభివర్ణించారు ట్రంప్. అనంతరం ఆయన అక్కడే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐ లవ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా.. అని అన్నారు. భారత ప్రజలు అంటే తనకు ఎంతగానో ఇష్టమని, ఆ దేశంతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, అనేక ఒప్పందాలపై సంయుక్తంగా పని చేస్తున్నామని అన్నారు. ప్రధాని మోదీతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్నారు.

ఈ వేడుకకు కొద్దిసేపటి ముందు- ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో టెలిఫోన్ లో మాట్లాడానని, వాణిజ్య సంబంధాల గురించి చర్చించానని అన్నారు. అనేక అంశాలు ఈ సందర్భంగా తమ మధ్య చర్చకు వచ్చినప్పటికీ ఎక్కువగా వాణిజ్యం గురించేనని చెప్పారు. భవిష్యత్ లో రష్యా నుండి భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేయదని ట్రంప్ పునరుద్ఘాటించారు. మోదీకి వాణిజ్యాంశాలపై చాలా ఆసక్తి ఉందని తెలిపారు.
భారత్, పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు, యుద్ధవాతావరణాన్ని నివారించమని ప్రధాని మోదీని కోరిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పాకిస్తాన్‌తో యుద్ధం కొనసాగించకూడదని కొంతకాలం కిందటే తామిద్దరం చర్చించుకున్నామని వ్యాఖ్యానించారు. వాణిజ్యం, టారిఫ్ లు కూడా అందులో భాగం కావడం వల్లే యుద్ధం గురించి మాట్లాడగలిగానని ట్రంప్ పేర్కొన్నారు. మోదీని ఓ గొప్ప వ్యక్తిగా ప్రశంసించారు. తనకు మంచి మిత్రుడని పేర్కొన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి ట్రంప్ ప్రస్తావించారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం త్వరగా ముగియాలని ప్రధాని మోదీ కోరుకుంటోన్నారని వివరించారు. అలా జరగాలంటే రష్యాతో భారత్ పెద్ద మొత్తంలో చమురును కొనుగోలు చేయకూడదని అన్నారు. సమీప భవిష్యత్ లో రష్యా నుండి భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేయదని చెప్పారు. రష్యా నుంచి చమురును పెద్దగా కొనట్లేదని, బాగా తగ్గించారని, మున్ముందు ఇంకా తగ్గిస్తారని ట్రంప్ స్పష్టం చేశారు.
రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లకు సంబంధించి చైనాపై టారిఫ్ విధించడానికి వివరణ ఇచ్చారు ట్రంప్. నవంబర్ 1 నుంచి చైనాపై సుమారు 155 శాతం టారిఫ్ విధిస్తామని అన్నారు. చైనాతో స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నప్పటికీ, కొన్ని సంవత్సరాలుగాఆ దేశం తమ పట్ల చాలా కఠినంగా వ్యవహరించిందని ట్రంప్ పేర్కొన్నారు. చైనా, ఇతర దేశాలు అమెరికాను దోచుకోవడానికి గత అధ్యక్షులు అనుమతించారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications