వీడియో: మానవత్వాన్ని చాటుకున్న కేటీఆర్..
మెదక్: అధికార భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన వారిని తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. వారికి తనవంతు సహాయ, సహకారాలను అందజేశారు. మెదక్ జిల్లా చేగుంట వద్ద ఈ సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.
వీడియో: మానవత్వాన్ని చాటుకున్న కేటీఆర్..#Telangana, #BRS, #KTR pic.twitter.com/oOYjDeLmua
— oneindiatelugu (@oneindiatelugu) July 16, 2023
ఇవ్వాళ కేటీఆర్ జగిత్యాల జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. జగిత్యాలకు చెందిన బీఆర్ఎస్ శాసన సభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ ఇంటికి వెళ్లారు. అక్కడే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ఆరా తీస్తోన్నారు.

అటు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో పార్టీ కార్యకలాపాలనూ స్వయంగా పర్యవేక్షిస్తోన్నారు. జిల్లా స్థాయి నాయకులతో కేటీఆర్ వరుసగా సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోన్నారు. వారికి దిశానిర్దేశం చేస్తోన్నారు. ఈ క్రమంలో ఆయన జగిత్యాల జిల్లాలో పర్యటించారు. పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు కేటీఆర్. మూడు ఎకరాల పొలం ఉన్న రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందంటూ ఇదివరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. మూడు గంటల విద్యుత్ సరిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలతో లక్షలాది మంది రైతులను అవమానించారని చెప్పారు.
విలేకరుల సమావేశాన్ని ముగించుకున్న అనంతరం కేటీఆర్..హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో మెదక్ జిల్లా చేగుంట వద్దకు చేరుకున్నారు. ఆయన కాన్వాయ్ వెళ్తోన్న సమయంలో.. రోడ్డు ప్రమాదానికి గురైన వారిని చూశారు. వెంటనే తన కాన్వాయ్‌ను నిలిపివేశారు. గాయపడ్డ వారిని పరామర్శించారు.
ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని పక్కనున్న వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన వాహనంలో సమీప ఆసుపత్రికి తరలించారు కేసీఆర్. వారికి అందించే చికిత్సపై తనకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలంటూ సిబ్బందికి సూచించారు. రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications