లోకసభ ఎన్నికలు 2019 : నంద్యాల నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Recommended Video

కర్నూలు జిల్లాలో రెండు పార్లెమంటు స్థానాలు ఉన్నాయి. ఇందులో ఒకటి నంద్యాల కాగా మరొకటి కర్నూలు. నంద్యాల పార్లమెంటు స్థానంకు మంచి గుర్తింపు ఉంది. ప్రముఖ శైవ క్షేత్రం మహానంది నంద్యాల పట్టణానికి 14 కిలోమీటర్లు దూరంలో ఉంది. అంతేకాదు ఇదే పార్లమెంటు స్థానంలో మరో పుణ్యక్షేత్రం ఉంది. అదే అహోబిలం. ఈ భూమి మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిలం క్షేత్రం ఒకటి. రాక్షసుడైన హిరణ్యకశ్యపుని సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమందు ఉద్భవించిన స్థలం ఈ అహోబిల పుణ్యక్షేత్రమని వ్యాస మహర్షి బ్రహ్మాండపురాణంలో రాశారు. మరోవైపు శ్రీశైలం మల్లికార్జున స్వామి నెలవైన శ్రీశైలం కూడా ఇదే లోక్‌సభ పరిధిలోకి వస్తుంది.
ఇక నంద్యాల పార్లమెంటుకు రాజకీయంగా ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడి నుంచి 10వ లోక్‌సభకు పోటీ చేసి గెలిచి పీవీ నరసింహారావు దేశానికి తొలితెలుగు ప్రధాన మంత్రి అయ్యారు. అంతేకాదు దక్షిణ భారతం నుంచి దేశానికి ప్రధానిగా అయిన తొలి వ్యక్తి కూడా పీవీ నరసింహారావే. ఇక ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి నంద్యాల పార్లమెంటు నుంచి గెలిచి కేంద్రంలో పలు పదవులను అధిరోహించారు. అంతేకాదు రాష్ట్రపతిగా కూడా దేశానికి సేవలందించారు. మొత్తానికి నంద్యాల నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. అవి ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్. 2007కు ముందు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా నంద్యాల లోక్‌సభ పరిధిలోకే ఉండేది. పునర్వవ్యస్థీకరణ తర్వాత గిద్దలూరు ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలో కలపడం జరిగింది.

నంద్యాల నియోజకవర్గంలో ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజ్యమేలింది. రెండు వర్గాల వారు ఇక్కడ కుటుంబ కక్షల కారణంగా మృతిచెందారు. అయితే మారుతున్న కాలంకు అనుగుణంగా ఇక్కడ ఫ్యాక్షనిజం కూడా తగ్గుముఖం పట్టింది. విద్యావంతులకు నెలవుగా నంద్యాల మారింది. ఇక రాజకీయ ముఖ చిత్రం చూస్తూ కాంగ్రెస్ నుంచి పెండేకంటి వెంకట సుబ్బయ్య నాలుగు సార్లు ఎంపీగా గెలువగా బీఎల్‌డీ అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డి ఒకసారి గెలిచారు. రెండు సార్లు పీవీ నరసింహారావు గెలవగా టీడీపీ నుంచి మూడుసార్లు భూమా నాగిరెడ్డి విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు. 2004,2009,2014లో ఎస్పీవై రెడ్డి నంద్యాల ఎంపీగా గెలుస్తూ వచ్చారు. ప్రస్తుతం వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎస్పీవై రెడ్డి అక్కడ ఎంపీగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి తన సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాస్యం ముహ్మద్ ఫరూఖ్‌పై 1,05766 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
ఈ సారి లోక్‌సభ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారనున్నాయి. నంద్యాలను శాసించే భూమా కుటుంబంలో అటు పెద్దదిక్కుగా ఉన్న భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిల మృతితో ఆ కుటుంబం కాస్త పట్టు కోల్పోయిందనే చెప్పాలి. అంతేకాదు మంత్రి అఖిలప్రియకు అక్కడి స్థానికంగా ఉన్న నేతలు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు శిల్పా కుటుంబం కూడా పుంజుకోవడం, ఎస్పీవై రెడ్డి కుటుంబానికే ఎంపీ టికెట్టు ఇవ్వాలని టీడీపీ భావిస్తుండటంతో అక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. అయితే భూమా ఫ్యామిలీకి ఆళ్లగడ్డ, నంద్యాల పట్టణంలో మంచి పట్టుంది. అంతేకాదు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు అభ్యర్థి గెలుపులో కీలకంగా వ్యవహరించనున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం కాస్త తక్కువగానే ఉండగా... క్రైస్తవులు, దళితులు, బీసీలు కూడా నంద్యాల పార్లమెంటు పరిధిలో బాగానే ఉన్నారు.












Click it and Unblock the Notifications