పోలింగ్‌పై వైసీపీలో ఆందోళన
Vijayasai Reddy: ఏపీలో పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం వరకు కొనసాగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల, కేంద్ర ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నారు.

నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి వీ విజయసాయి రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొద్దిసేపటి కిందటే ఆయన నెల్లూరు జిల్లాలోని వెంకటాయపాలెంలో గల పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఓటు వేశారు.
అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు విజయసాయిరెడ్డి. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఒక్కొక్క పోలింగ్ బూత్‌కు ఒక్కొక్క కానిస్టేబుల్‌నే కేటాయించారని, ఫలితంగా బారులు తీరిన ఓటర్లను నియంత్రించే వెసలుబాటు కలగట్లేదని అన్నారు. ఓటర్లు ఇబ్బందులకు గురి అవుతున్నారని చెప్పారు.
పోలీసుల వైఫల్యంగా సాయిరెడ్డి అభివర్ణించారు. పోలీసులు చాలినంత సంఖ్యలో లేకపోవడం వల్ల ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద తోపులాట జరుగుతోందని పేర్కొన్నారు. ఒక్కరే కానిస్టేబుల్ ఉండటం వల్ల అదుపు చేయటం సాధ్యం కావట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గంట పాటు తాను స్వయంగా ఓటర్లను నియంత్రించాల్సి వచ్చిందని అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.
అదనపు పోలీసు బలగాలను కేటాయించాలని కోరినప్పటికీ- కేంద్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం గానీ స్పందించలేదని సాయిరెడ్డి అన్నారు. తాము అదుపు చేయలేమని పోలీసులు చెబితే వైసీపీ సేవాదళ్ కార్యకర్తలను వినియోగించుకుంటామని, దీనికి అనుమతైనా ఇవ్వాలని కోరారు.












Click it and Unblock the Notifications