నయీం: బిగస్తున్న ఉచ్చు, లాయర్ల వద్దకు టీఆర్ఎస్ నేతల పరుగులు
హైదరాబాద్: నయీం కేసులో దర్యాప్తును సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉండటంతో నయీంతో లింకులున్న వారికి ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఎం కేసీఆర్ కూడా ఈ కేసుని చాలా సీరియస్‌గా తీసుకున్నారు.
దీంతో అధికారు టీఆర్ఎస్‌తో పాటు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నేతల లెసైన్స్‌డ్ ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలని సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే పలువురు నేతలకు నోటీసులు జారీ చేసి, కొందరి రాజకీయా నేతల ఆయుధ లెసైన్సులు కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది.
సిట్ దర్యాప్తులో 21 మంది పోలీసు అధికారులకు నయీంతో భూ లావాదేవీలు కొనసాగించినట్లు ఆధారాలు లభించాయి. ఇందులో భాగంగా మొదటి విడతలో 8 మంది అధికారులకు మెమోలు జారీ చేసినట్లు సమాచారం. వారి సర్వీస్ రివాల్వర్లను సరెండర్ చేయాలని సిట్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

నయీంతో అత్యంత సన్నిహితంగా
వీరిలో ఇద్దరు అదనపు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు ఉన్నట్లు తెలిసింది. త్వరలో మరో 13 మందికి మెమోలు ఇచ్చి వారి నుంచి కూడా సర్వీసు రివాల్వర్లు స్వాధీనం చేసుకోవాలని పోలీసు శాఖ యోచిస్తోంది. వీరంతా కూడా నయీంతో అత్యంత సన్నిహితంగా మెలగడంతో పాటు అతని నుంచి భారీగా లబ్ధి పొందినట్లు సిట్‌కు పక్కా ఆధారాలు లభించాయి. నయీంతో సన్నిహితంగా మెలిగిన ఫోటోలు కూడా సిట్ అధికారులకు దొరికాయి.

నయీంతో కలిసి భారీగా భూ లావాదేవీలు
నయీంతో కలిసి భారీగా భూ లావాదేవీలు జరిపినట్టు ఆధారాలు లభించడంతో పాటు వాటిని రిజిస్ట్రేషన్ల శాఖ కూడా ధ్రువీకరించింది. రాబోయే కాలంలో వీరందరిపై క్రమశిక్షణ చర్యల కింద పోలీసు శాఖ నుంచి తప్పించనున్నారు.
ఇదిలా ఉంటే నయీంతో లింకులున్నాయని వార్తలొస్తున్న నేతలు కొందరు ఈ కేసు నుంచి బయటపడేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తున్నారు.

అరెస్టు అయితే పరిస్థితి ఏంటి?
ఒకవేళ అరెస్టు అయితే పరిస్థితి ఏంటి? కేసును ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాల్లో స్పష్టత కోసం ఇప్పటికే కొందరు నేతలు సీనియర్ న్యాయవాదులను సంప్రదించారని తెలుస్తోంది. మరికొందరు సుప్రీం కోర్టు న్యాయవాదుల సలహా కూడా తీసుకుంటున్నారని అంటున్నారు. ఈ కేసులో ఎవరినీ ఉపేక్షించబోమని సీఎం కేసీఆర్ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలివ్వడంతో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

నయీం ఎన్‌కౌంటర్ తర్వాత సంచలన విషయాలు
తెలంగాణ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం ఎన్‌కౌంటర్ తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాలన్నీ ఈ కేసులో సంచలనంగానే ఉన్నాయి. రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల అండతో గ్యాంగ్‌స్టర్ అనేక అరాచకాలకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications