యువతులకు వల: నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్
హైదరాబాద్: నగరంలో ఓ నిత్య పెళ్లి కొడుకును ఫలక్‌నుమా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బిక్నూర్ ప్రాంతానికి చెందిన రహ్మత్ పాషా (29) ఏసి మెకానిక్. ఇతడు 2006లో సంతోష్‌నగర్‌లోని ఒవైసీ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే షాయిన్ సుల్తానాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు జన్మించాడు.
ఆ తర్వాత రహ్మత్ పాషా.. శాలిబండలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్న పర్వీన్‌బేగంను ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. మొదటి భార్యకు తెలియకుండా పర్వీన్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఫలక్‌నుమాలో ఇంటర్ ఒకేషనల్ కోర్సు చేస్తున్న చాంద్రాయణగుట్టకు చెందిన ఆసియా బేగం (26)కు ప్రేమ పేరుతో వల వేసి మూడో పెళ్లి చేసుకున్నాడు.

ఇంట్లో నుంచి వచ్చిన సమయంలో ఆసియా బేగం 7 తులాల బంగారం, రూ. 10 వేలు తీసుకొచ్చింది. నగలు, డబ్బులు తీసుకొని ఈమెతో నిజామాబాద్‌లోని బిక్నూరులో కాపురం పెట్టాడు. కాగా, మార్చి 15న రహ్మత్ పాషా మూడో భార్యతో కలిసి తీగలకుంటలోని రెండో భార్య వద్దకు వచ్చాడు. ఆసియా బేగం తన చెల్లెలు అని చెప్పి నమ్మించాడు.
ఇలా ఇద్దరి భార్యలకు ఒకరి విషయం మరొకరికి తెలియనీయకుండా జాగ్రత్త పడ్డాడు. అయినప్పటికీ అనుమానం వచ్చిన ఆసియా కూపీ లాగడంతో అసలు విషయం వెల్లడైంది. దీంతో ఆసియా బేగం తండ్రి అబ్దుల్ అజీజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications