కన్నమేసి వీధిబాలుడ్ని పంపించి మొబైల్ షాప్ దోపిడీ: పెట్టెలో దాక్కున్న బాలుడు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాదులో విచిత్రంగా ఓ మొబైల్ షాప్ దోపిడీ జరిగింది. శుక్రవారం రాత్రి ఈ దోపిడీ జరిగినట్లు గుర్తించారు. మొబైల్ షాప్‌నకు కన్నమేశారు. ఏ వీధి బాలుడ్ని బెదిరించి కన్నంలోంచి షాపులోకి పంపించారు. షాపులోని మొబైల్స్ బాలుడు అందిస్తూ ఉంటే సంచులను నింపుకున్నారు.
మొబైల్స్ ఖాళీ చేసిన తర్వాత బాలుడికి బయటకు రావడానికి వీలు కాలేదు. దీంతో బాలుడ్ని దుకాణంలోనే వదిలేసి దొంగలు పలాయం చిత్తగించారు. శనివారం ఉదయం షాపు యజమాని వచ్చి షాపు తెరిచి చూశాడు. ఓ పెట్టెలో దాక్కున్న బాలుడు అతనికి కనిపించాడు.
దోపిడీ జరిగిందని గుర్తించిన అతను పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో పోలీసులు షాప్‌కు వచ్చి బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దొంగలను గుర్తించేందుకు బాలుడు చెప్పే విషయాలు ఏమైనా పనికి వస్తాయా అనే దిశగా వారి దర్యాప్తు సాగుతోంది.

బంగారు గొలుసు చోరీ
ఇదిలావుటే, హైదరాబాద్ నగరంలోని జగద్గరిగుట్టలో ఇంట్లోకి చొరబడి ఓ మహిళ మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసును అపహరించారు. ఈ సంఘటనతో జగద్గరిగుట్టలో మహిళలు ఆందోళన చెందారు. పోలీసులు సంఘటనస్థలానికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు.
దారుణ హత్య
సికింద్రాబాద్ నగరానికి చెందిన కుషాయిగూడలోని ప్రశాంత్‌నగర్‌లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బావమరిదిని అతని బావ శ్రీనివాస్ గొడ్డలితో నరికి చంపాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పిచ్చికుక్కల స్వైర విహారం
నల్లగొండ జిల్లాలోని పెద్దఅవుర మండలం తిప్పలమడుగులో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. పిచ్చికుక్కల దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు బాలికలు ఉన్నారు. అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి రక్షించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications