బోగస్ సైట్ల సృష్టి: ఆన్‌లైన్ మోసాల ఘనుడు
హైదరాబాద్: నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి అతితక్కువ ధరలకే విలువైన ఎలక్ట్రానిక్స్ పరికరాలను అందజేస్తామంటూ నమ్మించి, మోసాలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని హైదరాబాద్ నగర క్రైమ్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. నగర పోలీస్ కంట్రోల్ రూమ్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను నగర నేరపరిశోధన విభాగం (క్రైమ్) అదనపు పోలీస్ కమిషనర్ స్వాతిలక్రా వివరించారు.
ఢిల్లీ అశోక్ విహార్ ప్రాంతానికి చెందిన నిఖిల్ అరోరా(26) మరో నలుగురు వ్యక్తులతో కలిసి వివిధ రకాల బోగస్ వెబ్ సైట్‌లను సృష్టించి క్విక్కర్ డాట్ కామ్‌లో వివిధ రకాల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను అతి తక్కువ ధరలకు ఇస్తామని మోసాలకు పాల్పడుతున్నారు. గత కొంత కాలంగా కొనసాగుతున్న ఆన్‌లైన్ మోసాలకు చెక్ పెట్టేందుకు నగర సైబర్ క్రైమ్ పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు విచారణను ప్రారంభించారు. దీంతో అసలు విషయం బయట పడింది.

ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ పరికరాల అమ్మలకోసం చూసిన ప్రకటనలకు ఆకర్షితులైన అమాయక ప్రజలు వెబ్ సైట్‌లో వారు సూచించిన ఫోన్ నెంబర్‌కు మాట్లాడంతో ఆర్డర్‌కు సంబంధించిన అడ్వాన్స్ సొమ్మును తమ బ్యాంక్ ఖాతాలో వేయమని సూచిస్తారు. దీంతో మోసపోయిన అమాయకులు వారి సూచనల మేరకు ప్రొడక్ట్‌కు సంబంధించిన నగదును బ్యాంక్ ఖాతాలో వేసిన తరువాత నిఖిల్‌తో పాటు ఈ గ్రూప్‌లో భాగస్వాములైన నామాన్ అరోరా, వికాస్‌తామార్, నిధికుమార్ ఫోన్‌లను స్విచ్ఛాఫ్ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల ప్రజలను మోసం చేస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, దీంతో నగరానికి చెందిన కొంత మంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారాణను ప్రారంభించిన్నట్లు స్వాతి లక్రా తెలిపారు. నగర సైబర్ క్రైమ్ ఎసిపి డాక్టర్ అనురాధ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ జి.శంకర్‌రాజు, ఎస్‌ఐ జనార్ధన్, కానిస్టేబుల్‌లు మహేష్, సునిల్, చంద్రమోహన్, ప్రసాద్‌లతో కూడిన బృందం ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న నిఖిల్‌ను గోవాలో అరెస్ట్ చేసి ఒక ల్యాప్‌టాప్, రెండు బ్యాంకులకు సంబంధించిన ఎటిఎమ్ కార్డులు, మూడు సెల్‌ఫోన్‌లో పాటు రూ.19లక్షల నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఈ మీడియా సమావేశంలో నగర నేర పరిశోధన విభాగం డిసిపి రవివర్మ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications