పింఛను డబ్బుతో గుంతలు పూడుస్తున్న వృద్ధ దంపతులు: జీహెచ్ఎంసీ తీరుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: నగరానికి చెందిన గంగాధర్ తిలక్, వెంకటేశ్వరి దంపతులు రోడ్లపై గుంతలు పూడుస్తున్న అంశంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. పింఛను డబ్బుతో తిలక్ దంపతులు గుంతలు పూడుస్తున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై హైకోర్టు విచారణ జరిపింది.

సిగ్గుచేటంటూ జీహెచ్ఎంసీపై హైకోర్టు ఆగ్రహం
ఈ సందర్భంగా హైకోర్టు.. జీహెచ్ఎంసీ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వృద్ధ దంపతులు రోడ్ల మరమ్మతులు చేస్తుంటే జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. రోడ్ల దుస్థితి చూడలేక వృద్ధ దంపతులు నడుం బిగించడం జీహెచ్ఎంసీకి సిగ్గుచేటని హైకోర్టు వ్యాఖ్యానించింది.

జీహెచ్ఎంసీ అధికారుల వేతనాలు తిలక్ దంపతులకివ్వడం మేలు
అంతేగాక, జీహెచ్ఎంసీ అధికారుల వేతనాలను తిలక్ దంపతులకు ఇవ్వడం మేలని అభిప్రాయపడింది హైకోర్టు. ప్రమాదాల్లో ప్రాణాలు పోతుంటే.. వాహనాలు దెబ్బతింటుంటే చూస్తూ కూర్చున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. పనిచేయనప్పుడు జీహెచ్ఎంసీకి బడ్జెట్ తగ్గించడం మంచిందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

హైదరాబాద్ రోడ్లపై గుంతలు లేవా? అంటూ నిలదీసిన హైకోర్టు
హైదరాబాద్ నగరంలో అద్భుతమైన రోడ్లు నిర్మిస్తున్నామని జీహెచ్ఎంసీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా.. రోడ్లపై గుంతలే లేవా? న్యాయవాదులతో తనిఖీ చేయించమంటారా? అని హైకోర్టు ప్రశ్నించింది. వర్షా కాలంలో దెబ్బతినే రోడ్ల మరమ్మతుల కోసం ప్రణాళికలేంటని జీహెచ్ఎంసీని నిలదీసింది. జోన్ల వారీగా జోనల్ కమిషనర్లు ఎస్ఈలు నివేదికలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.

తిలక్ దంపతులపై నలువైపులా ప్రశంసలు.. బిగ్ బి కారు కానుక
కాగా, నగరంలో రోడ్లపై గుంతల కారణంగా గతంలో అనేక ప్రమాదాలు జరిగి పలువురు ప్రమాణాలు కోల్పోయారు. అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. అయితే, గుంతల వల్ల ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు పోగొట్టుకోవడంపై చలించిన తిలక్ దంపతులు నగరంలో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రమాదాలను అరికట్టేందుకే తాము రోడ్లపై గుంతలను పూడ్చుతున్నామని 73 ఏళ్ల గంగాధర్ తిలక్ కట్నం, 64 ఏళ్ల ఆయన భార్య వెంకటేశ్వరి చెబుతున్నారు. 2010 నుంచి తిలక్ దంపతులు రోడ్లపై గుంతలను పూడ్చుతున్నారు. తరచూ ఓ కారులో రోడ్ బ్రాండ్ మెటీరియల్ తీసుకుని బయల్దేరే ఈ దంపతులు.. రోడ్లపై గుంతలు కనిపిస్తే వాహనాన్ని ఆపి గుంతలను పూడ్చివేసి వెళతారు. వారు తమ కారుకు పాత్ హోల్ అంబులెన్స్ అని పేరుపెట్టుకున్నారు. ఇప్పటి వరకు నగరంలో దాదాపు 2030 గుంతలను పూడ్చినట్లు, ఒక్కో గుంత పూడ్చేందుకు సుమారు రూ. 2 వేల వరకు ఖర్చవుతోందని తిలక్ దంపతులు తెలిపారు. ఈ దంపతులు తమ పింఛను డబ్బును ఉపయోగించి చేస్తున్న ఈ సేవపై నలువైపుల నుంచి ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు వీరికి ఓ కారును బహుమతిగా ఇచ్చారు.












Click it and Unblock the Notifications