తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి అస్వస్థత
అమరావతి: ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూత పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కిందటి నెల 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా గుండెపోటుకు గురైన తారకరత్న 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ కు తరలించారు. మోకిలలోని స్వగృహంలో నివాళి అర్పిస్తోన్నారు.
తారకరత్న మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, నారా లోకేష్ నివాళి అర్పించారు. సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ కన్నీరు పెట్టుకున్నారు. భావోద్వేగానికి గురయ్యారు.

తాజాగా- వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. తారకరత్న భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఈ సాయంత్రం ఆమె లోటస్ పాండ్ నివాసం నుంచి కారులో మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆమె వెంట పార్టీ నాయకులు పిట్ట రాంరెడ్డి తదితరులు ఉన్నారు.
కాగా- తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. తన భర్త హఠాన్మరణం చెందిన దిగ్భ్రాంతి నుంచి ఆమె తేరుకోలేకపోతున్నారు. భర్త దూరమయ్యాడన్న తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఈ క్రమంలో ఆమె అస్వస్థతకు గురయ్యారు. తారకరత్నకు గుండెపోటు సంభవించినప్పటి నుంచీ ఆమె సరైన ఆహారాన్ని తీసుకోవట్లేదని, నిద్రపోవట్లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భర్త కన్నుమూసిన సమాచారం తెలిసినప్పటి నుంచీ ఆహారం తీసుకోవట్లేదు. నీరసానికి గురయ్యారు.
సోమవారం ఉదయం 10 గంటలకు తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తరలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. 39 సంవత్సరాల వయస్సులోనే ఆయన అకాల మరణం తనను బాధించిందని చెప్పారు. అలేఖ్యరెడ్డి మానసిక ఒత్తిడికి లోనవుతోందని పేర్కొన్నారు. బాలకృష్ణకు తారకరత్న కుటుంబం రుణపడి ఉంటుందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications