అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. అరెకపూడి గాంధీతోపాటు ఆయన కుమారుడు, సోదరుడిపైనా కేసు నమోదైంది.
మరో ఇద్దరు కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, శ్రీకాంత్‌ను నిందితులుగా చేర్చారు. అరెకపూడి గాంధీకి పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వడంతో బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేశారు. ఈ క్రమంలో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఆయన మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.

తన ఇంటికి వస్తామంటూ సవాల్ చేయడంతో శుక్రవారం అరెకపూడి గాంధీ తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. దీంతో అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు, గాంధీ అనుచరులు కోడిగుడ్లు, టమాటాలతో దాడులు చేసుకున్నారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. దీంతో పోలీసులు వారికి మధ్య తోపులాట జరిగింది.
అనంతరం అరెకపూడి గాంధీని అరెస్ట్ చేసి, అదే రోజున విడుదల చేశారు. మరోవైపు, కాంగ్రెస్ నేతలు తమపై దాడి చేశారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అరెకపూడి గాంధీతోపాటు దాడిని అడ్డుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
సైబరాబాద్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీంతో ఓ పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించి, విధులు ఆటంకం కలిగించారని ఫిర్యాదు రావడంతో పాడి కౌశిక్ రెడ్డిపైనా కేసు నమోదైంది. మరోవైపు, తమపైనే దాడి చేశారంటూ కౌశిక్ రెడ్డిపై అరెకపూడి గాంధీ కూడా ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications