పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ టాప్-త్వరలో సరళీకృత పారిశ్రామిక విధానం: సీఎం రేవంత్
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు కింద గ్రీన్ ఫార్మా సిటీ నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాదులో బైయో ఏషియా సమ్మిట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఔటర్ రింగ్ రోడ్ - రీజియనల్ రింగ్ రోడ్ మధ్య ఫార్మా విలేజెస్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పిన రేవంత్ రెడ్డి.. తద్వారా 5 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
EV రాజధానిగా హైదరాబాదు
కొన్నేళ్ల క్రితం జీనోమ్ వ్యాలీని నిర్మించామని చెప్పిన రేవంత్ రెడ్డి త్వరలోనే నూతన లైఫ్ సైన్సెస్ పాలసీలను ప్రకటిస్తామని చెప్పారు. దేశంలోనే ఇప్పటి వరకు ఏ రాష్ట్రం ఇలాంటి పాలసీని ప్రకటించలేదని అన్నారు. రానున్న పదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీతో పాటు ఇతర ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం వివరించారు. హైదరాబాదు సిటీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ (EV) రాజధానిగా అవతరించిందని చెప్పుకొచ్చారు. దేశం మొత్తం మీద చూస్తే హైదరాబాదులోనే అత్యధిక ఈవీ వాహనాల అమ్మకాలు జరిగాయని గుర్తుచేశారు. త్వరలో 3వేల విద్యుత్ వాహనాలను ప్రజారవాణా సంస్థ టీఎస్‌ఆర్టీసీలో ప్రవేశపెడతామని చెప్పారు.

హెల్త్ కేర్, లైఫ్‌సైన్సెస్,ఫార్మా రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన బడా కంపెనీలు హైదరాబాదు నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని సీఎం రేవంత్ గుర్తు చేశారు. పరిశోధనలు నిర్వహిస్తున్న పలు కంపెనీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేసేలా చర్యలు తీసుకుందని చెప్పారు. ఉన్నత విద్యపై ఫోకస్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విద్యా సంస్థల ద్వారా పెద్ద సంఖ్యలో శాస్త్రవేత్తలు,సాంకేతిక నిపుణులను ఇంజినీర్లను ఆయా రంగాల్లో తయారు చేసిన ఘనత తెలంగాణకు దక్కుతుందని చెప్పారు.
డ్రైపోర్టుల నిర్మాణం వేగవంతం..
తెలంగాణ భూ పరివేష్టిత రాష్ట్రమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఒక మెగా డ్రై పోర్టును అభివృద్ధి చేసి.. ఇక్కడి నుంచి ఏపీలోని సీ పోర్ట్‌కు అనుసంధానం ఉండేలా ప్రత్యేక రైలు,రోడ్డు రవాణా సదుపాయాలు మెరుగుపరుస్తామన్నారు.అమెరికాకు చెందిన యాంజెన్ కంపెనీ హైదరాబాదు కేంద్రంగా తన కార్యకలాపాలను విస్తరించిందని చెప్పిన రేవంత్ రెడ్డి.. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న కమిట్‌మెంట్‌కు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వాములయ్యేందుకు ప్రపంచంలోని మేటి కంపెనీలు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సరళీకృత పారిశ్రామిక విధానాన్ని తమ ప్రభుత్వం తీసుకొస్తుందని ప్రతి పెట్టుబడిదారుడికి ప్రభుత్వం తమ సహాయసహకారాలను అందిస్తుందని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ దేశంలోనే ముందుందని సీఎం రేవంత్ చెప్పారు. అతి తక్కువ ద్రవ్యోల్బణం, అతిపెద్ద ఉద్యోగా ఉపాధి అవకాశాలు తెలంగాణ సొంతమని అన్నారు.

వివిధ రంగాల్లో 50వేల ఉద్యోగాలు
ఇటీవలే దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా తెలంగాణకు రూ.1.80 లక్షల పెట్టుబడులు వచ్చేలా ఒప్పందాలు జరిగాయని ... వివిధ రంగాల్లో 50వేల ఉద్యోగాలు వస్తాయని సీఎం చెప్పారు. గతేడాది లైఫ్ సైన్సెస్ రంగంలో 40వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయనే విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. మొత్తానికి గత పాతికేళ్లలో హైదరాబాదు ఫార్మా తయారీ కేంద్రంగా, ఐటీ డిజిటల్ హెల్త్ రంగాల్లో పవర్ హౌజ్‌గా గుర్తింపు పొందిందని సీఎం చెప్పారు. గతేడాది హైదరాబాదులో హెల్త్ కేర్ సమ్మిట్‌ను కూడా నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు.
చివరిగా బయో ఆసియా సమావేశానికి దేశ విదేశాల నుంచి హాజరైన అతిథులను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలుకుతూ... తమ వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు హైదరాబాదు సరైన నగరమని దీన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పలు బడా ఫార్మా కంపెనీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (MoU) కుదుర్చుకున్నాయి.












Click it and Unblock the Notifications