బండి సంజయ్ పై అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్..!!
తెలంగాణలో ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దం అవుతున్నాయి. వచ్చే ఎన్నికల కోసం అభ్యర్దులను ఖరారు చేస్తున్నాయి. బీఆర్ఎస్ వర్సస్ బీజేపీగా తెలంగాణలో ఎన్నికల పోరు మారుతోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పైన అధికార బీఆర్ఎస్ తమ అభ్యర్ధిని ఖరారు చేసింది.
తెలంగాణ లో కరీంనగర్ లోక్ సభ స్థానానికి ప్రత్యేకత ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి బండి సంజయ్ గెలుపొందారు. ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఈ సీటు పైన గురి పెట్టింది. ఇందు కోసం ముందుగానే అభ్యర్ధిని ప్రకటించింది.

బీఆర్ఎస్ అభ్యర్ధి ప్రకటన: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ లోక్ సభ అభ్యర్ధిని ప్రకటించారు. హుస్నాబాద్ లో పర్యటించిన కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై పోటీచేసే అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తారని వెల్లడించారు.
గత ఎన్నికల్లో సిరిసిల్లలో మినహా మరెక్కడా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్దికి మెజార్టీ రాలేదని చెబుతూ..ఈ సారి ప్రతీ సెగ్మెంట్ లోనూ మెజార్టీ ఇవ్వాల్సిందేనని నిర్దేశించారు. ఎంపీ గా గెలిపించిన బండి సంజయ్ నాలుగేండ్లలో ఏం చేశాడో చెప్పే దమ్మందా అని ప్రశ్నించారు. కరీంనగర్ ఎంపీ ఎవరంటే చెప్పుకోవడానికి తనకు సిగ్గు అవుతోందని వ్యాఖ్యానించారు.
వినోద్ కుమార్ పేరు ప్రకటన: గత ఎన్నికల్లో గెలిచిన బండి సంజయ్ కేవలం మతాల పేరుతో రెచ్చగొట్టడం తప్ప చేసిందేమీ లేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణ ప్రణాళికా సంఘం బాధ్యతలు చూస్తున్న వినోద్ కుమార్ సీఎం కేసీఆర్ కు విధేయుడు. తొలి నుంచి అటు ఢిల్లీలో..ఇటు రాష్ట్రంలో పార్టీ కీలక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత పార్టీ జాతీయ వ్యవహారాలన్నింటిలో వినోద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో కరీంనగర్ నుంచి వినోద్ ఎంపీగా పని చేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత 2014 లో జరిగిన ఎన్నికల్లో వినోద్ కుమార్ కరీంనగర్ ఎంపీగా గెలుపొందారు. 2009,2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

బండి వర్సస్ బోయినపల్లి: కరీంనగర్ ఎంపీగా మళ్ళీ వినోద్‌ను గెలిపించి.. బండి సంజయ్‌ను ఇంటికి పంపాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. వినోద్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు కేటీఆర్ చేసిన ప్రకటనతో వినోద్ మరోసారి పార్లమెంట్ కు పోటీ చేయటం ఫైన క్లారిటీ వచ్చింది. ఇదే సమయంలో బండి సంజయ్ వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ కు చేస్తారా, ముందు జరిగే అసెంబ్లీ బరిలోనే దిగుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నుంచి పోటీ చేసేందుకు బండి సంజయ్ సిద్దం అవుతున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. పార్టీ నిర్ణయం మేరకు అసెంబ్లీ, లోక్ సభ లో దేనికి పోటీ చేయాలనే నిర్ణయం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, కీలక నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్ధుల ప్రకటన ప్రారంభం కావటంతో రాజకీయం మరింత వేడెక్కుతోంది.












Click it and Unblock the Notifications