తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్: 6.80 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ కొనుగోలు
హైదరాబాద్: తెలంగాణ రైతులకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. బలవర్ధకమైన బియ్యం సేకరణలో తెలంగాణ రైతులకు కేంద్రం మరోసారి మద్దతిచ్చింది. 2021-22 రబీ సీజన్, 2022 -23 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం ఇటీవలే ఆమోదం తెలిపింది.
తాజాగా2022-23 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి మరో 6.80 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ సేకరిస్తామని వెల్లడించింది.తెలంగాణ రైతులకు మద్దతునందిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇటీవల కురిసిన అకాల వర్షాల మూలంగా నష్టపోయిన రైతులకు కొంత ఊరటనిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ నిరంతర సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ యుద్ధప్రాతిపదికన రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి, త్వరగా మిల్లింగ్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఇచ్చిన గడువు లోపు ఎఫ్‌సీఐకి బియ్యాన్ని అందజేయటానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. పారాబాయిల్డ్ రైస్ సేకరణ కోసం గత నెల్లో కేంద్రమంత్రి ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాసినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ నుంచి 15 లక్షల మెట్రికల్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు.
కాగా, ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పెద్ద మొత్తంలో వరి ధాన్యం తడిసిన విషయం తెలిసిందే. దీంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. రాష్ట్రంలో కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక, తరుగు ఎక్కువగా తీయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications