గ్రేటర్‌లో ప్రచారం చేస్తా, అందుకే కెసిఆర్ ఆహ్వానించారు: చంద్రబాబు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ పార్టీ నాయకులకు హామీ ఇచ్చారు. తెలంగాణ పార్టీ నేతలతో ఆయన శనివారంనాడు సమావేశమై జిహెచ్ఎంసి ఎన్నికలపై చర్చించారు.
పార్టీ వేరు, ప్రభుత్వం వేరని ఆయన అంటూల ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మంచి విషయాల్లో సహకరించుకోవాలని, అందుకే ఆయుత చండీయాగానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనను ఆహ్వానించారని చెప్పారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకుంటాయని, ఈ విషయంలో అపోహలు పెట్టుకోవద్దని ఆయన అన్నారు.

తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా మన పాత్ర నిర్వహిద్దామని ఆయన చెప్పారు. హైదరాబాద్ మేయర్ పీఠాన్ని మనం దక్కించుకుంటామనే నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. కష్టపడినవారికే గ్రేటర్ ఎన్నికల్లో టికెట్లు లభిస్తాయని ఆయన చెప్పారు. ఈ నెల 22వ తేదీన హైదరాబాదులోని అన్ని డివిజన్లలో జెండా పండుగ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. హైదరాబాద్ అభివృద్ధిలో తమ పార్టీ పాత్రను నగర ప్రజలకు వివరించాలని చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించారు.
గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ పార్టీ నేతలతో శుక్రవారంనాడు సమావేశమయ్యారు. బిజెపితో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని ఆయన కూడా విశ్వాసం వ్యక్తం చేశారు.
టిఆర్ఎస్‌కు బుద్ధి చెప్తారు
టిఆర్ఎస్ ప్రభుత్వం కొత్త డ్రామాలు ఆడుతోందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. శనివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. 2004 నుచి హైదరాబాదులో అభివృద్ధి కనిపించడం లేదని ఆయన అన్నారు. హైదరాబాదును చెత్తనగరంగా తయారు చేశారని ఆయన దుయ్య బట్టారు. టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పడానికి నగర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications