భద్రకాళి అమ్మవారి 3 కోట్ల స్వర్ణ కిరీటం ఇదే: మురిపెంగా సీఎం సతీమణి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా వివిధ ఆలయాలకు సీఎం కేసీఆర్ గతంలో మొక్కుకున్న మొక్కులను వరుసగా తీర్చనున్నారు. ఇందులో భాగంగా వరంగల్ భద్రకాళి అమ్మవారి మొక్కును ప్రభుత్వం తరఫున దేవీ నవరాత్రుల సందర్భంగా సీఎం కేసీఆర్ తీర్చుకోనున్నారు.

బంగారు కిరీటం: 11 కిలోల 700 గ్రాముల బరువు
11 కిలోల 700 గ్రాముల బరువుతో తయారు చేయించిన స్వర్ణ కిరీటాన్ని అమ్మవారికి సమర్పించనున్నారు. మూడు కోట్ల 70 లక్షల రూపాయల విలువ గల ఈ స్వర్ణ కిరీటాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల తొమ్మిదిన ఆదివారం ఉదయం సతీ సమేతంగా వెళ్లి వరంగల్ భద్రకాళి అమ్మవారికి సమర్పించనున్నారు.

జీఆర్టీ జ్యుయలర్స్‌తో ప్రత్యేకంగా తయారు చేయించారు
దీనిని నగరంలోని జీఆర్టీ జ్యుయలర్స్‌తో ప్రత్యేకంగా తయారు చేయించారు. దీని తయారీకి రూ. 3.70 కోట్లు వెచ్చించారు. శుక్రవారం క్యాబినెట్ సమావేశం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో స్వర్ణ కిరీటాన్ని పరిశీలించారు.

అమ్మవారి కిరీటానికి నమస్కరిస్తున్న సీఎం సతీమణి శోభ
ముఖ్యమంత్రి సతీమణి శోభ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి తదితరులున్నారు.

ప్రభుత్వం తరుపున మొక్కులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వరంగల్ భద్రకాళి అమ్మవారు, విజయవాడ కనక దుర్గమ్మ, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి మొక్కుకున్నారు. ఇందులో భాగంగా తొలుత భద్రకాళీ అమ్మవారికి ఆభరణాలు సిద్ధం అయ్యాయి. వరుసగా కేసీఆర్ మొక్కులు చెల్లించుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications