జన గణన చేయకపోవడంలో ఆంతర్యమేంటి?: బీజేపీ, బీఆర్ఎస్‌పై రేవంత్ తీవ్ర విమర్శలు
ధర్మపురి: తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారుది సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా శుక్రవారం ధర్మపురిలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు.
పోటీ చేసే అభ్యర్థి లేక ధర్మపురి ప్రజలు తిరస్కరించిన కొప్పుల ఈశ్వర్‌నే మళ్లీ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నిలబెట్టిందని రేవంత్ విమర్శించారు. మరోవైపు, బీజేపీ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. మోడీ వాట్సాప్ వర్సిటీలో అన్నీ అబద్ధాలే ప్రచారం చేస్తున్నారన్నారు. పదేళ్లు దేశ ప్రధానిగా ఉన్న మోడీ, ఐదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్రంలోని బీజేపీ సర్కార్ జనాభా లెక్కలు చేయకపోవడంలో ఆంతర్యమేంటని, కులగణన ఎందుకు చేయలేదో ఆ పార్టీ నేతలు చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. రిజర్వేషన్ల రద్దు కోసమే కులగణనలో జాప్యం వహించారన్నారు. పార్లమెంట్‌లో బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేయడం ఖాయమని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తేనే రిజర్వేషన్లు, రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమవుతుందని రేవంత్ చెప్పుకొచ్చారు.
విభజనచట్టంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కాలగర్భంలో కలిపేశారన్నారు. కాజీపేటకు ఇచ్చిన రైల్వే కోచ్ కర్మాగారాన్ని లాతూర్‌కు తరలించుకుపోయారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాకు ఐటీఐఆర్ కారిడార్‌ను సోనియాగాంధీ ఇస్తే దానిని కూడా రద్దు చేశారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించకుండా మొండి చేయి చూపించారని విమర్శించారు. తెలంగాణకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రేవంత్ కోరారు.












Click it and Unblock the Notifications