రేవంత్ ఇంట్లో 4 గంటలపాటు అదానీ!: రాహుల్‌కు కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వాలు అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అదానీ బండారం మళ్లీ అంతర్జాతీయంగా బయటపడింది. ఆఫ్రికా సహా దేశంలో ఆయన వ్యవహారంపై ప్రకంపనలు మొదలయ్యాయని అన్నారు.
అదానీపై కేసు పెట్టాలని, జేపీసీ వేయాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ ప్రధాని మోడీ పట్టించుకోలేదు. అదానీ కంపెనీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు రెండుసార్లు బయటపడింది. అమెరికాలో ఓ కోర్టు అదానీ సంస్థ లంచాలు ఇచ్చినట్లు తీర్పు చెప్పింది. గతంలో హిండెన్ బర్గ్ అనే సంస్థ కూడా అవకతవకలు జరిగినట్లు చెప్పిందన్నారు కేటీఆర్.

అదానీ అంశం కారణంగా భారతదేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా మసకబారింది. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి చాలా మంది మధ్యతరగతి మదుపర్లు నష్టపోయారు. అదానీ ఎన్నిసార్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నించినా మేము ఆయనను రానివ్వలేదు. అదానీ మమ్మల్ని కలిసి వ్యాపారం చేస్తామని అడిగాడు. కానీ, మేము ఆయనకు మర్యాదపూర్వకంగా చాయ్ తాగించి పంపించేశాం. అదానీతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
కానీ, కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించింది. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే ఎర్రతివాచీలు కాంగ్రెస్ పరిచింది. కాంగ్రెస్‌కు మాకు ఉన్న తేడా అదే. అదానీ విషయంలో బడే భాయ్ ఆదేశించగానే...చోటే భాయ్ అదానీకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికాడు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అదానీ సంస్థలతో రూ.12,400 కోట్లు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఘనంగా చెప్పారన్నారు కేటీఆర్.
అంతేకగా, 5000 కోట్లు గ్రీన్ ఎనర్జీ, 5000 కోట్లు డేటా సెంటర్, సిమెంట్ పరిశ్రమ పెట్టుబడులు ఇలా మొత్తం రూ.12,400 కోట్ల పెట్టుబడులు చేసుకున్నామని చెప్పారు. తెలంగాణ డిస్కంలను అదానీకి అప్పగించేందుకు ఓల్డ్ సిటీ బిల్లుల వసూళ్ల డ్రామా మొదలుపెట్టారు. అదానీకి డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు కుట్ర చేశారు అని కేటీఆర్ ఆరోపించారు.
యాదాద్రిలోని రామన్నపేటలో సిమెంట్ పరిశ్రమ వద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఏ మూసీ శుద్ధి అంటున్నారో అదే మూసీ సిమెంట్ ఫ్యాక్టరీ కారణంగా మురికి మాయం అవుతుందని చెప్పినా పట్టించుకోలేదు. ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్లుగా మమ అనిపించి అదానీకి సహకరించే పని చేశారు. పైన బడే భాయ్ ఆదేశించటంతో...కింద చోటా భాయ్ ఆచరించాడు.
దీంతో అదానీ గుండె ఉప్పొంగిపోయి స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం ఇచ్చాడు. ఇవన్నీ వ్యవహారాలు కూడా కుట్ర అని మేము భావిస్తున్నాం. 12,400 కోట్లతో తెలంగాణలో అదానీ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చే పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇంట్లో నాలుగు గంటల పాటు అదానీ సమావేశమయ్యారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications