భారత టెక్కీలకు ఆంక్షలు వద్దు: అమెరికాకు రాజ్‌నాథ్ సూచన
హైదరాబాద్: అమెరికాలో పనిచేయడానికి భారత సాఫ్ట్‌వేర్ నిపుణులపై ఆంక్షలు విధించే విషయంలో హేతుబద్దమైన విధానాన్ని అనుసరించాలని భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. భారత ఐటి నిపుణులు అమెరికాలో పనిచేసే విషయంలో ఆంక్షలు పెట్టదలుచుకుంటే హేతుబద్దమైన విధానాన్ని పాటించాలని ఆయన అన్నారు .
భారత్- అమెరికాలు సహజ మిత్ర దేశాలని, ప్రధాని నరేంద్ర మోడీ చొరవ, పర్యటనల వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాల్లో నూతన శకం ప్రారంభమైందని ఆయన అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, ఇక్కడ అద్భుతమైన వాణిజ్య అవకాశాలున్నాయని పిలుపునిచ్చారు.

అమెరికాలో ఉన్న భారత్ ఐటి ఉద్యోగులకు వీసా నిబంధనలను సరళతరం చేసేందుకు అమెరికా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. శుక్రవారం ఇక్కడ ఇండో అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడారు. 2009-10లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం విలువ 90 బిలియన్ల డాలర్లు ఉండగా, 2014-15కు 100 బిలియన్ డాలర్లకు చేరుకుందన్నారు.
విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు గతంలో ఉన్న అవరోధాలను తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు. వన్ టైం సెక్యూరిటీ క్లియరెన్సు విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. సెక్యూరిటీ క్లియరెన్సు రెన్యువల్‌ను 3 నుంచి 10 సంవత్సరాలకు పెంచామన్నారు. కొన్ని కేటగిరీల వీసాల ఫీజును పెంచారని, దీనిని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 7న అమెరికా పర్యటనలో ప్రధాని మోడీ ఈ విషయాన్ని ఆ దేశాధ్యక్షుడితో చర్చిస్తారని రాజ్‌నాథ్ చెప్పారు. గత ఆర్ధిక సంవత్సరంలో భారత్ 15 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించిందన్నారు.

దేశంలో ప్రత్యేకంగా ఆంధ్ర, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి వాతావరణం ఉందని గవర్నర్ నరసింహన్ చెప్పారు. రాజకీయ సుస్థిరత వల్ల రెండు రాష్ట్రాలూ ప్రగతిని సాధిస్తున్నాయన్నారు. వాణిజ్య రంగంలో పెట్టుబడులను విస్తృతం చేసేందుకు ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలు కొనసాగుతున్నాయని అమెరికా కాన్సుల్ జనరల్ మైకేల్ ముల్లిన్స్ అన్నారు.












Click it and Unblock the Notifications