ఈడీ సోదాల కలకలం - క్యాసినో ఏజెంట్లు లెక్కలు చూస్తే : నాటి గుడివాడ ఎపిసోడ్ తో..!!
హైదరాబాద్ కేంద్రంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఒకే సమయంలో ఎనిమిది చోట్ల ఈ సోదాలు ప్రారంభమయ్యాయి. ఈ సోదాల్లో ప్రధానంగా క్యాసినో నిర్వహించే ఏజెంట్లు లక్ష్యంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫెమా నిబంధనలు ఉల్లంఘిస్తూ క్యాసినోలు నిర్వహిస్తున్న వారిని టార్గెట్ చేసారు. శ్రీలంక క్యాసినో ఏజెంట్లు చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇళ్లలో ముందుగా సోదా చేస్తున్నారు. పలు పత్రాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్కులు..మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ఐఎస్ సదన్ తో పాటుగా బోయిన్ పల్లి ప్రాంతంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

క్యాసినో ఏజెంట్ల భారీ లావాదేవీలు
క్యాసినో ఏజెంట్ల బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈడీ ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇద్దరు కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించింది. అందులో ఏజెంట్లు మాధవ రెడ్డి, చికోటి ప్రవీణ్ లు ఇండో - నేపాల్ సరిహద్దుల్లో క్యాసినో నిర్వహించినట్లు తేలింది. ఈ ఇద్దరు పేకాట రాయుళ్ల కోసం స్పెషల్ ఫ్లైట్లలో టిక్కెట్లు ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురిని క్యాసినో ఆడేందుకు తీసుకెళ్తున్నారు. గత కొన్ని నెలలుగా శ్రీలంకలో సంక్షోభం నెలకొనడంతో.. క్యాసినో నిర్వహించే పరిస్థితి లేదు. రూట్ మార్చిన శ్రీలంక క్యాసినోలు నేపాల్‌తో పాటు భారత్ సరిహద్దుల్లోనూ క్యాసినో నిర్వహిస్తున్నాయి.

కస్టమర్ల నుంచి భారీ వసూళ్లు
జూన్ 10 నుండి జూన్ 13 వరకు ఇండో నేపాల్ బార్డర్ లో ఈవెంట్ నిర్వహించారు. క్యాసినోకు హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటూరు నుంచి చాలా మందిని ప్రవీణ్, మాధవ రెడ్డి తీసుకెళ్లారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేపాల్‌కు వెళ్లి అక్కడ క్యాసినో ఆడించారు. ఒక్కొక్కరి నుంచి దాదాపు 3లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ ఇద్దరు పేకాట రాయుళ్ల కోసం స్పెషల్ ఫ్లైట్లలో టిక్కెట్లు ఏర్పాట్లు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా వెస్ట్ బెంగాల్ లోని బాగ్ డోగ్ర ఎయిర్‌పోర్టుకు కస్టమర్లను తరలించి.. అక్కడినుండి నేపాల్ లోని హోటల్ మెచి క్రౌన్ లో ఆల్ ఇన్ క్యాసినో పేరుతో ఈవెంట్ నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది.

స్పెషల్ ఫ్లైట్లు .. ప్రైజ్ మనీ
ఈవెంట్‌లో టాలీవుడ్, బాలీవుడ్, డ్యాన్సర్లతో కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేయించారు. ప్రైజ్ మనీని హవాలా రూపంలో చెల్లించారు. గతంలో సంక్రాంతి సమయంలో గుడివాడల క్యాసినో నిర్వహణ పైన రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారానికి కారణమైంది. అందులోనూ ప్రవీణ్ పాత్ర ఉందని చెబుతున్నారు. ప్రవీణ్‌పై గతంలోనూ కేసున్నట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. మా నిబంధనల కింద కేసు నమోదు చేసింది ఈడీ. ఇదిలా ఉంటే గతంలోనూ చికోటి ప్రవీణ్‌పై సీబీఐ కేసు నమోదైంది. సోదాలు పూర్తయిన తరువాత ఈడీ అధికారులు మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications