8 మంది మావోల హతం: మృతుల్లో హరిభూషణ్, ధ్రువీకరించలేదని డిజిపి
ఖమ్మం: ఛత్తీస్‌గడ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు, కేంద్ర బలగాలకు మధ్య జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళా నక్సలైట్లు ఉన్నట్లు సమాచారం. చత్తీస్‌గడ్‌లో బీజాపూర్ జిల్లా గొల్లపల్లి, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చర్ల మండలం మధ్య అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.
మృతుల్లో ఖమ్మం డివిజన్ మావోయిస్టు కార్యదర్శి లచ్చన్న ఉన్నాడు. కాగా, మావోయిస్టు తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ కూడా మరణించినట్లు పోలీసులు నిర్ధారించడం లేదు. సంఘటనా స్తలంలో ఎకె 47 రైఫిల్ దొరకడంతో హరిభూషణ్ మరణించినట్లు ప్రచారం సాగుతోంది. ఎకె 47 వంటి అత్యధునాతన ఆయుధం మావోయిస్టు అగ్రనేతలకు మాత్రమే ఉంటుంది.

సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమవుతున్నారనే సమాచారంతో తెలంగాణ, ఛత్తీస్‌గడ్ పోలీసులు, కేంద్ర బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టులకు, కేంద్ర బలగాలకు మధ్య దఫాలు దఫాలుగా ఎదురు కాల్పులు జరిగాయి.
సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఎకె 47తో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం కేంద్ర బలగాలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గొల్లపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గాలింపు చర్యలు చేపట్టాయి.
కాగా, మృతదేహాలను ఇంకా గుర్తించలేదని తెలంగాణ డిజిపి అనురాగ శర్మ చెప్పారు. ఎదురుకాల్పుల్లో 8 మంది మరణించిన విషయాన్ని మాత్రం ఆయన ధ్రువీకరించారు. సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముందస్తు సమాచారంతోనే పోలీసులు అక్కడికి వెళ్లారని చెప్పారు. మావోయిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని ఆయన చెప్పారు.
మావోయిస్టుల మృతదేహాలను హెలికాప్టర్‌లో ఖమ్మం జిల్లా భద్రాచలం తరలించారు. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన హరిభూషణ్‌తో పాటు ఆయన భార్య కూడా ఎదురు కాల్పుల్లో మరణించినట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications