కరోనాతో మాజీ మంత్రి మాతంగి కన్నుమూత: వారం క్రితమే ఆయన భార్య కూడా
హైదరాబాద్/పెద్దపల్లి: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారినపడుతున్నారు. తాజాగా, మాజీ మంత్రి మాతంగి నర్సయ్య(76) కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.
కరోనాతోపాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారు. అతని భార్య జోజమ్మ వారం రోజుల క్రితం మృతి చెందారు. దీంతో మాతంగి నర్సయ్య కుటుంబంలో తీవ్వ విషాదం నెలకొంది.

గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మేడారం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ ప్రభుత్వంలో కొంతకాలంపాటు మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాతంగి మృతి పట్ల పార్టీలకతీతంగా నేతలంతా సంతాపం ప్రకటించారు.
కాగా, తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 1,27,697 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 31,699 యాక్టివ్ కేసులున్నాయి. 95,162 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడి 836 మంది మృతి చెందారు.












Click it and Unblock the Notifications