తెలంగాణ సచివాలయం ముట్టడి: అరెస్టులు- ఉద్రిక్తత
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసి జీఓ నంబర్ 46- ఉద్రిక్తతలకు తెర తీసింది.. అరెస్టులకు దారి తీసింది. ఈ జీఓను రద్దు చేయాలంటూ కొంతకాలంగా జిల్లా స్థాయిలో నిరుద్యోగులు కొనసాగిస్తోన్న ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు ఇవ్వాళ- హైదరాబాద్ వరకు పాకాయి. నిరుద్యోగులు పెద్ద ఎత్తున సచివాలయాన్ని ముట్టడించారు.
పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలను చేపట్టడానికి ప్రభుత్వం జారీ చేసిన జీఓ 46. ఈ జీఓ వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనను నిరుద్యోగులు వ్యక్తం చేస్తోన్నారు. అలాగే- వయోఃపరిమితిని 35 నుంచి 30 సంవత్సరాలకు కుదించడం సరికాదంటూ మండిపడుతోన్నారు.

ఈ జీఓను రద్దు చేయాలంటూ కొంతకాలంగా కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనలు సాగిస్తూ వస్తోన్నారు. ఈ మధ్యాహ్నం వారు మూకుమ్మడిగా సచివాలయాన్ని ముట్టడించారు. వేర్వేరు వాహనాల్లో ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకున్న సుమారు వందమందికి పైగా కానిస్టేబుల్ ఆశావహులు.. ఒక్కసారిగా సచివాలయం ప్రధాన గేటు వద్దకు దూసుకెళ్లారు.
జీవో నంబర్ 46ను రద్దు చేయాలంటూ నినదించారు. ప్లకార్డులను ప్రదర్శించారు. పాత పద్ధతిలోనే కానిస్టేబుళ్ల నియామకాలను చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ తాజా జీఓ వల్ల గ్రామీణ ప్రాంతవాసులకు అన్యాయం జరుగుతుందంటూ ధ్వజమెత్తారు.

సచివాలయంలోనికి దూసుకెళ్లడానికి వారంతా ప్రయత్నించారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు.. వారిని అడ్డుకున్నారు. రోప్ పార్టీ సిబ్బంది వారందరినీ సచివాలయం రోడ్డుకు అవతలి వైపు వరకూ తీసుకెళ్లారు. అనంతరం వారందిరినీ అదుపులోకి తీసుకుని, ప్రత్యేక వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో సచివాలయం పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications