తెలంగాణలో రేపట్నుంచి ఒంటిపూట బడులు: ఇంటర్ పరీక్ష్లలకు ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని పేర్కొంది.
ప్రభుత్వ బడుల్లో 12.30 గంటలకు తప్పనిసరిగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయాలని స్పష్టం చేసింది. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది. పదో తరగతి పరీక్ష కేంద్రాల బడుల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వులు స్పష్టం చేసింది.

రేపట్నుంచే ఇంటర్ పరీక్షలు: విద్యార్థులకు ఆర్టీసీ సహకారం
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పరీక్షలకు మొత్తం 1,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
కాగా, ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ పలు కీలక విషయాలను వెల్లడించారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా సెంటర్‌లోకి అనుమతిచ్చేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1473 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,82,677 కాగా, సెకండ్ ఇయర్ 4,65,022 మంది ఉన్నారు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావొద్దనే ఉద్దేశంతో.. ఎగ్జామ్ ప్యాడ్ చూపిస్తే ఆర్టీసి బస్సు ఆపేలా సూచనలిచ్చామని తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల వైపు ఎక్కువ బస్సులు తిరిగేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మాల్ ప్రాక్టీస్ చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నవీన్ మిట్టల్. విద్యార్థులు ఏవైనా సమస్యలుంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు.












Click it and Unblock the Notifications